తెలంగాణ సచివాలయంలో భారీ సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన, పర్యావరణ హిత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా ఉన్న తెలంగాణ సచివాలయాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగులు వేస్తోంది. విద్యుత్ ఖర్చులను తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే లక్ష్యంతో సచివాలయం ప్రాంగణంలో భారీ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకత ఏమిటంటే ఈ సోలార్ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఉద్యోగులు మరియు అధికారులకు అత్యవసరమైన కార్ పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అందించబోతోంది.
సచివాలయం ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో అత్యాధునిక సాంకేతికతతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 27 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తికాగా, 17 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది.
ఇప్పటికే ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్ అండ్ బి శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనుల్లో భారతీయ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక సోలార్ ప్యానెల్స్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడకుండా, సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సోలార్ ప్రాజెక్టు పూర్తయితే సచివాలయం ప్రాంగణంలోనే దాదాపు 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్‌కోకు అందించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని ద్వారా ప్రభుత్వ విద్యుత్ వ్యయభారం తగ్గడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు లభించనుంది.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని కార్ పార్కింగ్ షెడ్ల రూపంలో రూపొందిస్తున్నారు. అంటే ఒకే నిర్మాణం ద్వారా రెండు ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి, మరోవైపు పార్కింగ్ సదుపాయం. సచివాలయంలో చాలా కాలంగా ఉన్న పార్కింగ్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉంది. మొత్తం 260 కార్ల పార్కింగ్‌కు అనువుగా ఈ షెడ్లను నిర్మిస్తున్నారు.
దీంతో ఉద్యోగులు, అధికారులు తమ వాహనాలను సౌకర్యవంతంగా పార్క్ చేసుకునే అవకాశం లభించనుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదా, ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు, ఉద్యోగుల సౌకర్యం… ఇలా అనేక ప్రయోజనాలను ఒకే వేదికపై అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మరో మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తికానుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఆదర్శంగా నిలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



