Tirumala: తిరుమలలో భక్తులకు పార్కింగ్ కష్టాలు

Tirumala: ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు కలిగిన దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. మహిమాన్వితమైన ఆ దేవదేవుడి దర్శనానికి క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భక్తులతో సమానంగా వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. నానాటికీ సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.. దీంతో పరిమితంగా ఉన్న తిరుమలలో పార్కింగ్ సమస్య పెనుభారంగా మారింది.
ఒక రోజుకి 10,000 వాహనాలు తిరుమలకు వస్తుండడంతో ముఖద్వారమైన అలిపిరి దగ్గర నుండి వాహనాల బేజారు మొదలైంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం భక్తులకు అసౌకర్యం కలగకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను టీటీడీ రచించాల్సిన సమయం ఆసన్నమైంది మరి టీటీడీ ఏం చేస్తుంది. ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఏంటిఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశవిదేశాల నుంచి వేలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు. చాలామంది సొంత, ప్రైవేటు వాహనాల్లో చేరుకుంటారు. వీరంతా సరిపడా పార్కింగ్ స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.టీటీడీ అధికారులు కొత్త పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నా ఉచిత ధర్మరథం బస్సులు అందుబాటులో ఉన్నా తిరుమలలో ఉన్న మౌలిక సదుపాయాలకు మించి వాహనాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో రెండు, అలిపిరిలో రెండు మల్టీలెవర్ పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించడానికి ప్రతిపాదనలు చేసినా అమలుకు నోచుకోలేదు.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక రోజుకు 90 వేల నుంచి లక్ష వరకు వుంటుంది. అయితే తిరుమలకు సొంత కార్లు, ప్రైవేటు జీపులతో కలిపి దాదాపు 10,000 వేల వాహనాలు వస్తున్నాయి. మరోవైపు, ఆర్టీసీకి చెందిన 400 బస్సులు కొండపై చేరుకుంటున్నాయి. అలాగే 1500 ద్విచక్ర వాహనాలు ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటాయి.. కాగా తిరుమలలో 5000 వాహనాలకు మాత్రమే పార్కింగ్ స్థలాల సామర్థ్యం వుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వాహనాల సంఖ్య ఇంకా ఎక్కువే వుంటుంది.
తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అడిషనల్ ఈవో .
టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జీఎంలు కమిటీ గా ఏర్పడి వారం రోజులలోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.. నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని, అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు తమ వాహనాల పార్కింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలతో కొండపైకి వస్తుంటే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేవని చెబుతున్నారు. తిరుమలలో వాహనాలు నిలిపేందుకు నిర్దేశిత స్థలాలు తగినంత లేకపోవడంతో సమస్యగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుపతి, తిరుమలలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం కోసం ప్రణాళికలు చేపట్టినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తిరుమల విజన్ 2047లో భాగంగా పార్కింగ్ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.



