జాతియం

కేంద్ర మంత్రిమండలిలో భారీ మార్పులు

Union Cabinet: కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి అంశాలపై చివరి క్షణం వరకు గోప్యత పాటించడం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకత అయినా వివిధ సంకేతాలను బట్టి.. ఇప్పటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఏ క్షణమైనా పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని భావిస్తున్నారు. మంత్రిమండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలను భర్తీచేయడంతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) వంటి పార్టీల నుంచి చీలికవర్గం ఎంపీలు ప్రత్యేక వర్గాలుగా ఏర్పడి భాజపాకు మద్దతు ప్రకటిస్తుండటంతో వాటి నుంచీ కొందరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. భాజపా నూతన సారథి నితిన్‌ నబీన్‌ జట్టులో కీలకమైన పదవుల్ని కొంతమంది యువ నేతలకు అప్పగించే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ పదవుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చింది.

కొందరు కేంద్ర మంత్రులతో నబీన్‌ కొద్దిరోజుల క్రితం చర్చలు జరిపారు. కొత్తవారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరి శాఖల్ని మార్చడం వంటి వాటిపై సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం వరకు సీషెల్స్‌ పర్యటనలో ఉండే ప్రధాని మోదీ తిరిగి జులై 6 నుంచి 11 వరకు విదేశాల్లో ఉంటారు. జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి జులై 1 నుంచి 3 వరకు మన దేశంలో పర్యటించనున్నారు. అందువల్ల ప్రధాని వెసులుబాటును బట్టి మంత్రిమండలిలో మార్పులు చేపట్టనున్నారు.

పశ్చిమ బెంగాల్‌ నుంచి కొందరు ఎంపీలను మంత్రిమండలిలోకి తీసుకోనున్నారు. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్‌ నేతకు క్యాబినెట్‌ మంత్రి పదవి లభించనుందని తెలుస్తోంది. తృణమూల్, శివసేన (యూబీటీ) చీలిక వర్గాల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చేముందు స్పీకర్‌ నిర్ణయం కీలకం కానుంది.

గవర్నర్లుగా థావర్‌చంద్‌ గహ్లోత్‌ , మంగూభాయ్‌ పటేల్‌, గుర్మీత్‌సింగ్‌ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని వీరి స్థానాల్లోకి పంపిస్తారని, ఆ మేరకు మంత్రిమండలిలో యువ రక్తాన్ని తీసుకువస్తారని చెబుతున్నారు. ఆప్‌ నుంచి విడిపోయి బీజేపీలో చేరుతున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరికి విస్తరణలో బెర్తులు ఖాయం కానున్నాయి.

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్‌ఈ డిజిటల్‌ మూల్యాంకనంలో తప్పిదాల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భవితవ్యం సందిగ్ధంగా మారింది. రాజ్యసభ సభ్యులుగా నవంబరులో పదవీకాలం ముగిసిపోతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పురీ, బి.ఎల్‌.వర్మ ఉన్నారు. వారికి మరో అవకాశం లభిస్తుందా..లేదా అనేది తేలాలి. పంకజ్‌ చౌధరీ, హర్ష్‌ మల్హోత్రాలకు యూపీ,ఢిల్లీ రాష్ట్రశాఖల పార్టీ బాధ్యతల్ని అప్పగించారు. ఒకరికి ఒకే పదవి నిబంధన కింద వీరిద్దరినీ మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

జార్జి కురియన్, రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూల రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 21న ముగిసింది. మంత్రి పదవికి కురియన్‌ రాజీనామా సమర్పించారు. పంజాబ్‌ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా బిట్టూకు పార్టీ సూచించినట్లు సమాచారం. ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల నుంచి పలువురికి ఈసారి మోడీ బృందంలో మంత్రులుగా అవకాశం రావచ్చని సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button