అంతర్జాతీయం

Europe Heatwave: నిప్పుల కొలిమిలా యూరప్‌..!

Europe Heatwave: శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండం.. ఇప్పుడు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో యూరప్‌ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జూన్‌ 21 నుంచి ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా ఐరోపా వ్యాప్తంగా 1,300 మందికి పైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఒక్క ఫ్రాన్స్‌లోనే గత బుధవారం నాటికే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ విపరీతమైన వేడి.. ఒక ‘నిశ్శబ్ద హంతకి’గా మారిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్‌లోని ఇళ్లు, పాఠశాలలు, పని ప్రదేశాలు ఇలాంటి అధిక వేడిని తట్టుకునేలా నిర్మించకపోవడమే ఈ స్థాయిలో మరణాలు సంభవించడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజే ఐరోపా వ్యాప్తంగా దాదాపు 19 కోట్ల మంది ప్రజలు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

ముఖ్యంగా జర్మనీ, చెక్‌రిపబ్లిక్‌, హంగరీ, పోలాండ్‌ దేశాల్లో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఐరోపా ఖండం రెండింతల వేగంతో వేడెక్కుతోందని, తక్షణమే ఐరోపా దేశాలు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button