ప్రపంచ తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్!

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ ఐపీఓ వాల్ స్ట్రీట్‌లో అత్యంత విజయవంతంగా అడుగుపెట్టడంతో ఆయన ఆస్తుల విలువ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ప్రస్తుతం మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా 1.1 ట్రిలియన్ డాలర్లకు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 94.6 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి.
ఈ ఐపీఓకు ముందే మస్క్ సంపద 971 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు స్పేస్‌ఎక్స్ లిస్టింగ్ తర్వాత అందులోని ఆయన వాటా విలువే 866 బిలియన్ డాలర్లకు చేరింది. దీనికి టెస్లా, ఎక్స్ వంటి ఇతర కంపెనీల వాటాలను జత చేయడంతో ఆయన సంపద ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. కాగా, ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ సంపద 304 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది.
మస్క్ వ్యక్తిగత సంపద ఇప్పుడు కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. తైవాన్ దేశ మొత్తం జీడీపీ 976 బిలియన్ డాలర్లు కాగా.. మస్క్ సంపద అంతకంటే ఎక్కువే ఉంది. అంతేకాదు, ప్రస్తుతం భారతదేశ జీడీపీ సుమారు 4.15 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే.. అందులో నాలుగో వంతు సంపద ఒక్క మస్క్ వద్దే కొలువై ఉంది. గత మూడు దశాబ్దాలుగా టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్ వంటి సంస్థలతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మస్క్ వ్యాపార దూకుడును మార్కెట్ విశ్లేషకులు ఎలాన్ ప్రీమియంగా అభివర్ణిస్తున్నారు.



