అమెరికా – ఇరాన్ మధ్య ముదిరిన వివాదం

అంతర్జాతీయంగా మరో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రాజుకున్న నిప్పు.. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతమంతా దావానలంలా విస్తరిస్తోంది. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యూఏఈ వంటి పొరుగు దేశాలకు సైతం విస్తరించడంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
దీని తక్షణ ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 3 శాతానికి పైగా ఎగబాకాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలు మళ్లీ మొదలయ్యాయి. ఒకవైపు అనుమతి లేని నౌకపై దాడి చేశామని, జలమార్గాన్ని మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటిస్తే.. మరోవైపు వాణిజ్య నౌకల కోసం జలసంధి తెరిచే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం నౌకల రాకపోకలు గత ఐదు వారాల్లోనే అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
గత నెలలోనే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం.. తాజా ఘర్షణలతో పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లెక్కల ప్రకారం ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరా సాధారణ స్థాయి కంటే రోజుకు 9.4 మిలియన్ బ్యారెళ్లు తక్కువగా నడుస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలు చూస్తుంటే ఈ ఇంధన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



