రెండో రోజు సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన

సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు నిర్వహించే ‘APAC సెమీకండక్టర్ రౌండ్ టేబుల్’ సమావేశానికి ఆయన హాజరవుతున్నారు. దీంతో పాటు అమరావతి రాజధాని నగర రూపకల్పనపై సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో కీలక చర్చలు జరపనున్నారు.
అలాగే, సింగపూర్ ఉప ప్రధాని కిమ్ యాంగ్ బృందంతో భేటీ కానున్న చంద్రబాబు, భవిష్యత్తులో నగరాల అభివృద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నమూనాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ పర్యటనలో భాగంగానే సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలోనూ పాల్గొని, అంతర్జాతీయ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించనున్నారు. ఈ వరుస సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి స్వదేశానికి బయలుదేరనున్నారు.



