తెలంగాణ

నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీఆర్ఎస్ శ్రేణుల్లో గులాబీ జోష్ కనిపిస్తోంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం, ఇదే రోజున తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా జలదృశ్యం వేదికగా ఆవిర్భవించిన గులాబీ జెండా, నేడు రజతోత్సవ వసంతంలోకి అడుగుపెట్టింది. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ పార్టీగా, ఆపై దశాబ్ద కాలం పాటు పాలక పక్షంగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భారత్ రాష్ట్ర సమితి.. నేడు తన 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ జెండాలు ఎగరవేయనున్నారు.. అయితే, ఈసారి వేడుకల్లో ప్రధాన ఘట్టం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీ అత్యంత కీలకం కాబోతోంది. ఓవైపు మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీని క్షేత్రస్థాయిలో తిరిగి ఎలా పుంజుకునేలా చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే అంశాలపై గులాబీ బాస్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు ఇబ్బంది పడకూడదన్న కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఈసారి ప్లీనరీని కేవలం కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, స్థానికంగానే వేడుకలు జరపాలని సూచించారు. తెలంగాణ భవన్‌కు కేవలం ఆహ్వానం ఉన్న నాయకులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button