ఈ నెల 21 నుంచి టీజీ 20 లీగ్-2026 ప్రారంభం

తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్-2026 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ లీగ్‌కు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండగా, శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో హెచ్‌సీఏతో పాటు ఫ్రాంఛైజీలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశాయి. ఇటీవల హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ప్రత్యేక డ్రోన్ డిస్ప్లే షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జట్ల లోగోలను ఆకాశంలో ప్రదర్శించి నిర్వాహకులు లీగ్‌కు ప్రత్యేక ప్రచారం కల్పించారు. అలాగే ఇవాళ ట్యాంక్‌బండ్‌పై టీజీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. లీగ్‌లో తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడనున్నాయి. ఇక జూన్ 23న పాలమూరు స్ట్రైకర్స్‌తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుందని హెచ్ సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు.
టీజీ20 లీగ్ విజేత జట్టుకు ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి అందజేయనున్నట్లు టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు తెలిపారు. రన్నరప్ జట్టుకు 50 లక్షలు, మూడో మరియు నాలుగో స్థానాల్లో నిలిచే జట్లకు 25 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్‌తో పాటు ఆకట్టుకునే లేజర్ షో ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన మినహా ఐపీఎల్లో అమలులో ఉన్న అన్ని నియమాలు అమలు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అభిమానుల కోసం డిస్ట్రిక్ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచామని, టికెట్ ధరలను కేవలం 50 రూపాయలు, 100 రూపాయలుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.



