తెలంగాణ
నేటితో ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు

సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. పుష్కరాల చివరి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి పితృతర్పణాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ముక్తేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. పుష్కరాల ముగింపు రోజున మరింత మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది.



