మిస్టరీగా మారిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి పది రోజులు దాటినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. తుని మండలం సిహెచ్. అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఈనెల 6న అదృశ్యమైన చిన్నారి కోసం ఇప్పటికే వందలాది మంది సిబ్బంది గాలిస్తున్నారు.
ఇక చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదని డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ వెల్లడించారు. ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారం లభించలేదని చెప్పారు. టవర్ డంపింగ్ విశ్లేషణతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనుమానితులను ఇప్పటికే విచారిస్తున్నామని వెల్లడించారు.దీనిలో భాగంగా పాప అదృశ్యమైన ప్రాంతంలో ప్రత్యేకంగా ఇనుప బోనును ఏర్పాటు చేశారు. ఆ బోనులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచి, వాటిలో మాంసం ముక్కలను పెట్టారు. ఏదైనా వన్యమృగం ఆ ప్రాంతానికి వస్తుందా అనే అంశాన్ని గుర్తించేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. బోను చుట్టూ కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి, జంతువుల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తునారని డీఎస్పీ స్పష్టం చేశారు.
అలాగే అవి అటవీ శాఖ అధికారులు జంతువులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన అనిమల్ ట్రాప్ బోన్లేనని, వాటికి చిన్నారి మిస్సింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చిన్నారి కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రత్యేక బృందాలు నిరంతరం శోధిస్తున్నాయని తెలిపారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు యథావిధిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ వెల్లడించారు.



