విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో నలుగురు సిబ్బంది మృతి చెందారు. సాంకేతిక లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పుణెలోని బారామతిలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు అజిత్ పవార్ ఉదయం 8:10 గంటలకు ముంబయి నుంచి విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ ఉదయం 8:30 గంటలకు అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అది విఫలమవడంతో 8:42 గంటలకు మరోసారి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ సమయంలో విమానం నియంత్రణ కోల్పోయి రన్‌వేకు సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో పుణె–బారామతి ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. ఇది కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఓ బండరాయిని ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి.



