జాతియం

Vladimir Putin: డిసెంబ‌ర్ 4,5 తేదీల్లో ఇండియాకు పుతిన్‌

Vladimir Putin: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశాన్ని సందర్శిస్తారని రష్యా మీడియా క్రెమ్లిన్‌ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇండియా వస్తున్నారు. ఇండియా-రష్యా చమురు దిగుమతులపై అమెరికా సుంకాలు విధించిన తర్వాత గత కొన్ని నెలల్లో రెండు దేశాలకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటనలో పుతిన్ ఇండియా పర్యటన ఖరారైంది. తరువాత షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ,పుతిన్ చైనాలో కలుసుకున్నారు.

రెండు దేశాలకు ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్ పర్యటనపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షలు, గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం వంటి పరిణామాల కారణంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ట్రంప్, పుతిన్ ఇండియా పర్యటనపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే రష్యా విషయంలో ఇండియా తీరుపై గుర్రుగా ఉన్న ట్రంప్, కచ్చితంగా ఏదో పెడబొబ్బలు పెట్టడం మాత్రం ఖాయమన్న విశ్లేషణను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ ముందువరుసలో నిలిచింది. ఈ అంశం అమెరికాతో భారత్ సంబంధాలపై ప్రభావం చూపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై ఒత్తిడి పెంచాడు. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున అదనంగా 50 శాతం సుంకం విధించాడు. చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

అయితే భారత్‌ మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. స్థానిక అవసరాలు, ధరల పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని, జియోపాలిటికల్ ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పింది. ఇదే సమయంలో అమెరికా నుంచి కూడా భారత్‌ పెద్ద మొత్తంలో క్రూడ్ కొనుగోలు చేస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా LNG గ్యాస్ ఇండియా భారీగా దిగుమతి చేసుకుంటున్నట్టు తేలుస్తోంది.

పుతిన్ పర్యటనలో రక్షణ రంగం ప్రధాన అజెండాగా ఉండనుంది. భారత్-రష్యా రక్షణ భాగస్వామ్యం దశాబ్దాల నాటి బంధం. ఇప్పటికే భారత్‌కు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సుఖోయ్ సిరీస్ యుద్ధ విమానాలు, యుద్ధ విమానాల సాంకేతికతను రష్యా అందిస్తోంది. రెండు దేశాలు సంయుక్తంగా తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఈ పర్యటనలో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-75 చెక్‌మేట్ సాంకేతిక బదిలీకి గ్రీన్ సిగ్నల్ లభించగా విధివిధానాలు ఖరారు కానున్నాయి. పుతిన్ ఇండియా రాక మరో కీలక అంశాన్ని ప్రపంచం ముందుకు తెస్తోంది.

ఇండియా అటు అమెరికాతో ఉంటుందా లేదంటే రష్యాతోనా అన్న చర్చ మొదలవుతుంది. ఐతే ఇండియా మొదట్నుంటి రెండు దేశాలతో బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తూ వస్తోంది. స్ట్రాటేజిక్ ఆటానమీ పేరుతో భారత్‌ రెండు శక్తులను బ్యాలెన్స్‌ చేస్తోంది. పుతిన్‌ పర్యటన కేవలం ద్వైపాక్షిక సమావేశం మాత్రమే కాకుండా, భవిష్యత్‌ గ్లోబల్ పవర్ ప్లేస్‌మెంట్‌కు మార్గదర్శకంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రక్షణ, ఇంధన వనరులు, అంతరిక్ష పరిశోధనలు, వాణిజ్య ఒప్పందాలు ప్రధాన చర్చాంశాలుగా నిలువనున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button