Cough Syrup: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు

Cough Syrup: చూస్తూ చూస్తూ ఎవరూ విషాన్ని తాగాలనుకోరు. ఎదుటివారు తాగాలని కూడా కోరుకోరు. కానీ ఇప్పుడు అదే సిరప్ రూపంలో పసిపిల్లల ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రుల కళ్లు ముందే భవిష్యత్తును చూడాల్సిన పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంతకీ ఈ వ్యవహారంలో ఎవ్వరిది తప్పు.. ప్రభుత్వానిదా..? తయారు చేసిన కంపెనీదా..? రాసిన వైద్యులదా..? దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.?
దేశ వ్యాప్తంగా ఇప్పుడు కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సిరప్ తాగి మన దేశ వ్యాప్తంగా 21 మంది చిన్నారులు బలయ్యారు. వీరంతా కూడా ఐదు సంవత్సరాలలోపు వారే. కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. వాస్తవానికి దగ్గు మందులో రసాయనాలు కలపడం నిషేధం. కానీ ఆ కంపెనీ ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కింది. అంతేకాదు అడ్డగోలుగా కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ లు విక్రయించింది.
వైద్యులకు తాయిలాలు ఎర వేసి కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ను పిల్లలు తాగేలా చేసింది. మొదట్లో ఈ సిరప్ తాగిన పిల్లలు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత అందులో ఉన్న రసాయనాలు వారి శరీరాల మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. దగ్గు తగ్గడం మాట అటు ఉంచితే చివరికి వారి ప్రాణాలు పోయాయి. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.
దాన్ని విచారించేందుకు తాజాగా న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిల్‌పై తక్షణమే విచారణ జరపాల్సి ఉందని పిటిషనర్, న్యాయవాది విశాల్ తివేరి తెలిపారు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జయ్ భూయాన్, జస్టిస్ కె.వినోద్చంద్రన్లతో కూడిన ధర్మాసనం న్యాయవాది అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంది.
మరోవైపు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గు మందు కోల్డ్ రిఫ్ సిరప్‌లో 48.6 శాతం విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ ను తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. కంచిపురం జిల్లా సమీపంలోని ఫార్మా తయారీ కంపెనీలో రెండు రోజుల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించారు. డైథిలీన్ గ్లైకాల్ అనే కెమికల్ ఉనికిని పరీక్షించేందుకు నమూనాలను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపారు.
ఈ పరీక్షల్లో దగ్గు మందులో డైఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు తేలిపోయింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గు మందు అమ్మకాలను నిషేధించింది. కాగా డైథిలిన్ గ్లైకాల్ విషపూరితమైనది. డైథిలిన్ గ్లైకాల్ మానవ శరీరంలో విషంగా పనిచేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గుండె, మూత్రపిండాలు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో పలువురు చిన్నారులు కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా చనిపోయారు.
ఇటు రాజస్థాన్‌లోనూ మూడు మరణాలు సంభవించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బేతుల్ జిల్లాలో పేరెంట్స్‌కు ఈ సిరప్‌ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇక్కడే ఇద్దరు చిన్నారులు సిరప్ కారణంగానే మరణించినట్లు సమాచారం అందుతోంది. దీంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ మరణాల సంఖ్య 21కి పెరిగింది.
సిరప్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బిపోయి మూత్రపిండాలు ఫెయిల్ అయ్యి మరణిస్తున్నారు. ఈ తరహా లక్షణాలతో ఎనిమిది మంది చిన్నారులు నాగ్‌పూర్, భోపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. మరోవైపు చిన్నారుల సిరప్ మరణాలపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది.
వరుస మరణాల నేపథ్యంలో చిన్నారులు వాడిన 19 రకాల మందుల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్‌లో డైఇథైలిన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అక్టోబర్ 2న వెల్లడించిన నివేదికలోనూ ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో కోల్డ్రిఫ్ సిరప్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ నివేదిక తర్వాత మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్రిఫ్ స్టాక్లను నిషేధించి స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్‌లో కూడా ఇలాంటి మరణాలు సంభవించడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్పత్తిని ఆపేయించింది. ఇక తనిఖీల అనంతరం, ఆ తయారీ యూనిట్ లైసెన్సును రద్దు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసింది.
అంతేకాకుండా సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన డాక్టర్ ప్రవీణ్ సోనీతో పాటు తయారుదారీ కంపెనీ స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 , సెక్షన్ 276 , డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 27A ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులు జీవిత ఖైదు శిక్షకు దారి తీసే అవకాశం ఉంది.
ఇక ప్రమాదకరమైన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌ను తయారు చేసిన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అధినేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషపు సిరప్ కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇప్పటివరకు సుమారు 21 మంది చిన్నారులు మరణించినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మధ్య ప్రదేశ్ పోలీసులకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం రంగంలోకి దిగి తమిళనాడులోని కాంచీపురంలో కంపెనీ యజమాని జి. రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే త్వరలోనే రంగనాథన్‌ను చెన్నై కోర్టులో ప్రవేశపెడతామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
తదుపరి విచారణ కోసం ట్రాన్స్ఫర్ రిమాండ్ కోరతామన్నారు. రిమాండ్ మంజూరైన వెంటనే అతన్ని చెన్నై నుంచి మధ్య ప్రదేశ్‌కు తరలించి మరింత లోతుగా విచారిస్తామని తలిపారు. ఇంకోవైపు ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆరోగ్య సంక్షోభ వేళ సీఎం మోహన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి అస్సాంకు జాలీగా ట్రిప్‌కు వెళ్లడం విమర్శలకు తావిచ్చింది.
దేశ వ్యాప్తంగా పిల్లలకు వాడే దగ్గు మందుల నాణ్యత, వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని పేరెంట్స్‌కు, అలాగే ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా, ఔషధ తయారీ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ ఎం నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. పిల్లల విషయంలో దగ్గు మందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన అసాధారణ సంఘటనలపై నిఘా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సకాలంలో నివేదికలు తెప్పించుకోవాలని ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలో వర్షాలు ఇప్పటికీ కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధుల ముప్పు పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు దగ్గు మందులు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇప్పటికే కోల్డ్ రిఫ్ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సిరప్‌ల స్టాక్‌ను గుర్తించేందుకు మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. మరో వైపు ప్రజారోగ్య విభాగం దగ్గు మందు వాడకంపై ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.
పిల్లల్లో సాధారణంగా దగ్గు, జలుబు వచ్చినప్పుడు తగిన నివారణ చర్యలతోనే కట్టడి చేయొచ్చని వెంటనే తగ్గి పోవాలని ఎడాపెడా మందులను వాడితే అది చిన్నారుల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది. నేరుగా మెడికల్ దుకాణాలకు వెళ్లి ఫార్మసిస్టు సలహాతో సిరప్లు వాడకం చిన్నారులపై తీవ్ర దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
కొన్ని దుకాణాల్లో వైద్యులు రాసిచ్చిన మందులు అందుబాటులో లేవని, అదే ఫార్ములాతో మరో సిరప్ ఇస్తామంటూ తల్లిదండ్రులకు టానిక్లను విక్రయించడం కూడా ప్రమాదమే అని ఈ విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆరేళ్లలోపు చిన్నారుల విషయంలో మందుల వాడకం పట్ల చాలా జాగ్రత్తలు అవసరమని రెండేళ్ల లోపు పిల్లలకు అసలు దగ్గు, జలుబు సిరప్‌లను పూర్తిగా నిషేధించాలని, కేవలం నివారణ చర్యలతోనే కట్టడి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
కాగా 2022లో మన దేశం నుంచి కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ గాంబియా దేశానికి ఎగుమతి అయ్యాయి. అక్కడ దాదాపు డజన్ మంది పిల్లలు చనిపోయారు. అయినప్పటికీ ఆ దారుణం నుంచి మన దేశం పాఠాలు నేర్చుకోలేదు. దీనికి తోడు ఔషధాల తయారీలో వ్యవస్థాపరమైన లోపాలు ప్రజల ప్రాణాలను ఎలా తీస్తున్నాయో ఈ ఉదంతం బయటపెట్టింది. విచ్చలవిడిగా దగ్గు మందులను వాడితే కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. మానసిక సమస్యలకు దారి తీస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలు, నిద్రలేమికి దారి తీస్తుంది. జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి.
చిన్న దగ్గు, జలుబుకు ఆవిరి పట్టుకుంటే చాలని, శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. మరోవైపు ఈ కోల్డ్రిఫ్ సిరప్‌పై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. మొత్తానికి ఈ సిరఫ్ను వాడొద్దని డీసీఏ స్పష్టం చేసింది. ఈ బ్యాచ్ నెంబర్ గల సిరప్ ప్రజలు, డీలర్లు, మెడికల్ షాపుల్లో ఉన్నా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీసీఏ కోరింది. తస్మాత్తు జాగ్రత్త అని హెచ్చరించింది.



