Rajnath Singh: దేశాలకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు

Rajnath Singh: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అక్షర సత్యం. ఇప్పుడు అదే మాట కేంద్ర మంత్రి నోట రావడం చర్చనీయాంశంగా మారింది. దేశానికి శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాజ్ నాథ్ నోట ఆ మాట రావడానికి కారణమేంటి..? మళ్లీ అమెరికాతో సంబంధాలు కొనసాగుతున్నాయా..?
దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం ఉండవని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ స్తిరంగా ఉండవని, కేవలం రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలు ఆధారంగా సంబంధాలు ఏర్పడుతాయని ఆయన అన్నారు. దేశాల మధ్య ఎప్పుడు శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడం కూడా అత్యంత అవసరమని అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది.
నేటి ప్రపంచం చాలా వేగంగా మారుతోందని ప్రతిరోజూ కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాతి పరిణామాలు, ట్రంప్ సుంకాలు, అలాగే ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని వెల్లడించారు. ప్రపంచం వేగంగా మారుతున్నందున కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.
మహమ్మారులు, ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు వంటి అంశాలతో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో నిండి ఉందని ఈ నేపథ్యంలో మన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఆత్మనిర్భరత అత్యవసరం. మనకు శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు, కేవలం దేశానుకూలమైన శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదని ఆయన అన్నారు.
భారతదేశం ఎప్పుడూ ఎవరినీ శుత్రువులగా చూడదని రాజ్‌నాథ్ అన్నారు. తమకు రైతులు, వ్యవస్థాపకుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ, భద్రత అత్యంత ప్రాముఖ్యం అని స్పష్టం చేశారు. 2014లో రక్షణ ఎగుమతి 700 కోట్ల కంటే తక్కువగా ఉండేదని ఇప్పుడు దాదాపు 24వేల కోట్లకు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పారు. భారతదేశం ఇకపై కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదని ఎగుమతిదారుగా కూడా మారుతోందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తోంది. ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏడేళ్ల తరువాత ప్రధాని మోదీ చైనాకు చేసిన పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది.
ఒత్తిళ్లు పెరిగేకొద్దీ భారత్ మరింత బలపడుతుందని, ఆత్మనిర్భరత లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. తమ సిద్ధాంతాలు, నైతిక విలువల విషయంలో ప్రధాని మోదీ ఎన్నడూ రాజీపడరని ఆయన గుర్తుచేశారు. భారత్ ఎవరినీ శత్రువుగా చూడదని, కానీ దేశ ప్రయోజనాలకు ఎవరు అడ్డువచ్చినా ఉపేక్షించేది లేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
మన రైతులు, వ్యాపారవేత్తల ప్రయోజనాలే మనకు ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయాల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడటం సరైన ఎంపిక కాదని స్పష్టమవుతోంది. స్వావలంబన అనేది మన ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు అత్యవసరం. ఇక మన బలగాలు స్వదేశీ పరికరాలతో లక్ష్యాలపై కచ్చితత్వంతో చేసిన దాడులు దూరదృష్టి, సమన్వయానికి నిదర్శనం. అలాంటి సన్నద్ధత లేకపోతే ఏ మిషన్ విజయవంతం కాదు.
కాగా ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. తియాజింగ్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ , రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 20 మందికిపైగా ప్రపంచ నాయకులు పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్-చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని చెప్పారు.
పరస్పర గౌరవం, ఉభయదేశాల ప్రయోజనాలు, సున్నితత్వాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలో మున్ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇవి ఇరుగుపొరుగున ఉన్న అతిపెద్ద ప్రపంచదేశాలు. వీటిమధ్య సంబంధాలు బాగుంటే దాని ప్రభావం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త శాంతి, సుసంపన్నతలపై పడుతుందని వ్యాఖ్యానించారు.
తమ దేశంలో మోదీ పర్యటన నేపథ్యంలో చైనా ఎంబసీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. భారత్, చైనాల మధ్య సాంస్కృతిక సంబంధాలను చాటిచెప్పే చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమలు ఇవి. శతాబ్దాల కాలం నుంచే ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనే దానికి ఇదొక అందమైన ప్రతీక’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ జత చేసింది.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతను ప్రస్తావిస్తూ, ఆర్థికంగా బలమైన దేశాలైన భారత్-చైనా కలిసి పనిచేయడం ఎంతో అవసరమని మోదీ నొక్కిచెప్పారు. ప్రపంచ ఆర్థిక క్రమానికి స్థిరత్వం తీసుకురావడంలో ఇరు దేశాల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రావడం, ఇప్పుడు ప్రధాని మోదీ చైనాకు వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై కూడా జిన్ పింగ్ తో చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కావాలంటే చైనా, భారత్ లు కలసి పనిచేయాలని ఇప్పటిక ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఆయన పర్యటన చైనాలో కొనసాగనుంది.



