వ్యాపారం

Rupee Value: రూపాయి రికార్డు పతనం.. చరిత్రలో తొలిసారి రూ.90 దాటిన డాలర్ విలువ

ప్రపంచ మార్కెట్‌ను డాలర్ శాసిస్తోంది. అందుకే అని దేశాలు డాలర్‌తో తమ కరెన్సీని పోల్చుకుంటాయి. అయితే డాలర్‌కు ప్రయత్నామ్నాయ కరెన్సీ కోసం పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. యూరో తెచ్చినా అంతగా సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు చైనా, రష్యా, భారత్‌ కూడా ప్రత్యామ్నాక కరెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ దేశాల మధ్య వైరుధ్యాల కారణంగా కార్యరూపం దాల్చడం లేదు. ఇదిలా ఉంటే అమెరికా కరెన్సీ డాలర్‌ దూకుడు పెంచుతోంది. తాజాగా డాలర్‌ దెబ్బకు భారత రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. రోజులు గడిచేకొద్దీ రూపాయి విలువ దారుణంగా పతనమతోంది. అసలు.. మన రూపీ ఎందుకిలా పడిపోతోంది..? దీని వెనకున్న కారణాలేంటి..?

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో.. ఇండియా కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. తొలిసారి డాలర్‌తో పోలిస్తే.. ఏకంగా 90 మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ప్రపంచ, దేశీయ అంశాల నుంచి కరెన్సీపై కొన్ని వారాలుగా ప్రెజర్ పెరుగుతోంది. ఈ క్రమంలో రూపాయి పతనమైన తీరు అందరినీ షాక్‌కి గురిచేసింది. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి డబ్బుని ఉపసంహరించుకోవడం, షార్ట్ కవరింగ్ కొనసాగడంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడింది. ఇవన్నీ రూపాయి క్షీణించేందుకు కారణమయ్యాయ్. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ లాంటివి కూడా రూపాయి విలువని బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇదిలాగే కొనసాగితే రూపాయి విలువ 91కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కుదరకపోవడం, పదే పదే జాప్యం కారణంగా రూపాయి తొలిసారి 90 మార్క్ కంటే దిగువకు పడిపోయి ఉండవచ్చు. మార్కెట్లు ఇప్పుడు విస్తృతమైన హామీల కంటే బలమైన సంఖ్యలను కోరుకుంటున్నాయి. ఫలితంగా కొన్ని వారాలుగా రూపాయిలో అమ్మకాలు వేగంగా సాగుతున్నాయి. పెరిగిన వస్తువుల ధరలు సెంటిమెంట్‌ని మరింత దెబ్బతీశాయి.

అధిక స్థాయిలో మెటల్, బంగారం ధరలు భారతదేశ దిగుమతి బిల్లుని మరింత దిగజార్చాయి. అమెరికా సుంకాలు సైతం ఎగుమతుల పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఖనిజ ఇంధనాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలు, రత్నాల లాంటి దిగుమతుల రంగాలతో పోలిస్తే.. ఇది ఈక్విటీలలో సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని చెబుతున్నారు. ఆర్బీఐ జోక్యం లేకపోవడం వల్లే రూపాయి క్షీణించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పష్టమైన సంకేతం కోసం మార్కెట్ వెయిట్ చేస్తోంది. ఆర్బీఐ విధాన ప్రకటనతో.. కరెన్సీని స్థిరీకరించడానికి సెంట్రల్ బ్యాంక్ అడుగుపెడుతుందా..? లేదా..? అనే దానిపై మార్కెట్లు స్పష్టతని ఆశిస్తున్నాయ్. టెక్నికల్‌గా రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఇప్పుడది 89 లోపు బలపడటం ఎంతో అవసరం. అందువల్ల రూపాయి 90 పైన స్థిరపడుతుందా..? మరింత పడిపోతుందా..? అనేదే ఇప్పుడున్న మేజర్ టెన్షన్. కానీ దిగుమతి, ఇతర రంగాలు వెంటనే అధిక ఖర్చుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, అవసరమైన దిగుమతులు బలహీనమైన కరెన్సీకి సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రజలపై ఆ ప్రభావం పడుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత రూపాయి విలువ దారుణంగా పతనమవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అంశాలున్నాయ్. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెంచినప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపుతారు.

దీని వల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి, అది మరింత బలపడుతుంది. ఫలితంగా మన రూపాయి సహా ఇతర దేశాల కరెన్సీల విలువ పడిపోతుంది. భారత్‌ దిగుమతులు పెరుగుతున్నా ఆ మేరకు పెరగడం లేదు. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది కాబట్టి డాలర్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. ఇక దేశంలో ధరల పెరుగుదల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది ఇన్వెస్టర్లకు అంత ఆకర్షణీయంగా ఉండదు. దాంతో రూపాయి బలహీనపడుతుంది.

రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. మరి నెక్ట్స్ ఏంటి..? ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి స్థిరపడుతుందా..? మరింత కిందకు పడిపోతుందా..? అనేదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. ఆర్బీఐ పాలసీ సిగ్నల్, విదేశీ పెట్టుబడులు, భారత్-యూఎస్ ట్రేడ్ డీల్స్ మీదే రూపాయి ఫ్యూచర్ ఆధారపడి ఉందా.? మన రూపీ ఇలాగే పడిపోతూ ఉంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితేంటి? రూపాయి విలువ పడిపోవడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లని ఎలా నిర్ణయిస్తుందనేది ఇప్పుడు చాలా ముఖ్యం. వడ్డీ రేట్లు పెంచడం వల్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశాలు పెరిగి రూపాయికి మద్దతు లభిస్తుంది.

ఫారిన్ పోర్ట్‌ఫోలియో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో దేశంలోకి డాలర్లు ఎంత ఎక్కువగా వస్తే రూపాయి అంత స్థిరంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్లే రూపాయి బలహీనపడుతోందంటున్నారు నిపుణులు. అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందాలు కుదిరితే భారత ఎగుమతులు పెరిగి, డాలర్ల రాబడి పెరుగుతుంది. ఇది రూపాయికి కొంత బలాన్ని ఇస్తుంది. అంతేకాదు క్రూడ్ ఆయిల్ రేట్లు రూపాయిపై అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతాయ్. మన దేశం ఎక్కువగా చమురుని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి.. ధరలు పెరిగితే, డాలర్ల కోసం డిమాండ్ పెరిగి.. రూపాయి పడిపోతుంది.

రూపాయి విలువ పడిపోవడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం లాంటి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఆ వస్తువులని మనం డాలర్లలో కొంటున్నాం కాబట్టి. దీంతో మన రూపాయిని ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరగడం వల్ల దేశీయంగా ప్రజల జీవన వ్యయం కూడా పెరుగుతోంది. రూపాయి పతనం అవ్వడం అనేది ఇంధన ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 85శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు మనం డాలర్లలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

దీని వల్ల కూడా డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ క్షిణిస్తుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయ్. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు డబ్బులు పంపించాలంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తుంది. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకునేవారికి డాలర్‌తో పోలిస్తే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఒక వేల రూపాయి విలువ ఇలాగే పడిపోతూ ఉంటే దాని ప్రభావం కచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని నిపుణులు అంటున్నారు.

రూపాయి పతనం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి ఆ భారం ప్రజలపై పడి, దేశంలో ద్రవ్యోల్చణం పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి విలువ స్థిరపడాలంటే విదేశీ పెట్టుబడులు భారీగా పెరగాలి వాణిజ్య లోటు తగ్గాలి. అంతర్జాతీయ చమురు ధరలు దిగి రావాలి. అప్పుడే రూపాయి తిరిగి బలపడడం మొదలవుతుంది.

ఇక అమెరికా డాలర్ ఈ రోజుకీ ప్రపంచ మార్కెట్ ని పాలిస్తోంది. డాలర్ కి ఆల్టర్నేషన్ అన్నది లేకుండా పాతోంది. అలాంటి దానిని తేవాలని జరిగిన ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ శాసిస్తోంది. డాలర్ ఎపుడు స్పీడ్ పెంచినా అది ప్రపంచ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఇబ్బందులో పడుతున్నాయి. భారత్ చైనా రష్యా వంటి దేశాలు డాలర్ కి ఆల్టర్నేషన్ గా కొత్త కరెన్సీని తేవాలని చూస్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో డాలర్ దెబ్బ తినిపిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే రూపాయి పతనం ఇదే తీరున సాగితే మాత్రం మన రూపాయి 91, 92 కి కూడా తొందరలోనే పడిపోతుంది అని అంటున్నారు. మరోవైపు రూపాయి పతనంపై ప్రభుత్వం ఎలాంటి ఆందోళన చెందడం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్‌ అన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90 స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. రూపీ పతనంతో ద్రవ్యోల్బణం, ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపదని భారత పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మాత్రం మారకం కోలుకుంటున్నదన్న ధీమాను వ్యక్తం చేశారు.

రూపాయి విలువ పతనం అనేది కేవలం సంఖ్యా పరమైన మార్పు కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న లోపాలు, అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడికి నిదర్శనం. రెండు మూడు రోజుల క్రితం మన జీడీపీ పెరిగందని గొప్పగా చెప్పుకున్నాం.. అమెరికా ఆంక్షలు ఉన్న మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదని సంబరపడ్డాం. కానీ.. తాపా పరిణామాలు భారత్‌ను షాక్‌కు గురిచేశాయి. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయి. రూపాయి పతనంతో మరింత దిగజారే పరిస్థితి. చూడాలి మరి రూపాయిని ఎలా కాపాడుతారో ఏమి చేస్తారో.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button