ప్రజల గడప వద్దకే పరిపాలన – సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రజల సమస్యలను వారి గడప వద్దనే పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.నేడు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశలను గత పాలకులు విస్మరించడంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
గతంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల వద్దకు పంపించి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా మరోసారి 99 రోజుల ప్రజా ప్రగతి ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్ పరిధిలో 10 నుంచి 13 గ్రామ పంచాయతీలను చేర్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.
మూడు నెలల్లో న్యాయబద్ధమైన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని, ప్రతి దరఖాస్తుపై జవాబుదారీతనంతో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జమ చేయడం వల్ల ప్రభుత్వంపై విశ్వాసం పెరగడంతో ప్రజా దర్బార్లో వచ్చే దరఖాస్తులలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఉంటున్నాయని తెలిపారు.ధరణి వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను భూభారతి ద్వారా పరిష్కరించామని, సాదా బైనామా దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
భూ సేకరణలో వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తూ, పెండింగ్ అంశాలను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ సర్వే చేపడుతున్నామని, రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా సర్వే చేసి మ్యాప్ నమోదు చేసే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.మనిషికి ఆధార్ కార్డు లాగా ప్రతి భూమికి ప్రత్యేకంగా భూధార్ నెంబర్ ఇచ్చే వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని, పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో అమలు చేస్తున్నామని, కూసుమంచి మండలంలో కూడా అమలు జరుగుతుందని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పాలేరు నియోజక వర్గం ముందుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా వరి, మొక్కజొన్న పంటలను పెద్ద ఎత్తున రైతులు పండించారని, వాటిని కనీస మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, పంటకు సంబంధించిన చెల్లింపులను రికార్డు సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు.
మే 4న ఖమ్మంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 80కి పైగా కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం మే 4న జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



