ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

Jharkhand: ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలింది. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి బయల్దేరిన ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 7.11కి బయల్దేరి 7.34 గంటల సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన కాసేపటికి ఈ ఘోరం జరిగింది.
రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటేడ్కి చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 విమానం రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. చికిత్స కోసం 41 ఏళ్ల సంజయ్‌కుమార్‌ను ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ అంబులెన్సులో రోగితోపాటు ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.



