Sanchar Saathi App: మొబైల్స్‌లో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి

Sanchar Saathi App: భారతదేశంలో తయారు చేసినా, లేదా దిగుమతి చేసుకున్న అన్ని హ్యాండ్సెట్లలో సంచార్ సాథి మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వ చర్య సైబర్ మోసం నుండి పౌరులను రక్షించడానికి, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందడంలో సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతుంటే, పౌరులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును కాలరాస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. సంచార్ సాథీ యాప్ ద్వారా, ప్రజలపై నిఘా పెట్టేందుకేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కేంద్రం వెంటనే వెనక్కి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సంచార్ సాథి మొబైల్ యాప్ దాని వెబ్ పోర్టల్ ద్వారా అనేక పౌర-కేంద్రీకృత సేవలను టెలికమ్యూనికేషన్ల శాఖ అందిస్తోంది. ఈ సేవల్లో చక్షు కీలకమైంది. దీని ద్వారా సైబర్ మోసాలను అరికట్టవచ్చని, అనుమానిత కాల్స్‌ను బ్లాక్ చేయొచ్చని కేంద్రం అంటోంది.
మోసపూరిత కమ్యూనికేషన్ కాల్స్ గురించిన సమాచారాన్ని తక్షణం టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చేరవేయడం ద్వారా, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టాలన్న ఉద్దేశంతోనే ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించినట్టు టెలికామ్ శాఖ చెబుతోంది. సంచార్ సాథి వెబ్సైట్ ప్రకారం, చక్షు ప్రజలు హానికరమైన వెబ్ లింక్‌లు, మోసపూరిత కమ్యూనికేషన్లను బ్లాక్ చేయడానికి వీలు కలుగుతుంది. ఫిషింగ్ లింక్‌లు, క్లోనింగ్ ప్రయత్నాలు, SMS, RCS, iMessage, WhatsApp, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ అయ్యే మాల్వేర్లను నిరోధించవచ్చని టెలికామ్ శాఖ అంటోంది.
టెలి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో పనిచేస్తోంది. నవంబర్ 28 నుండి 90 రోజుల్లోపు భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న అన్ని మొబైల్ హ్యాండ్సెట్లలో సంచార్ సాథి యాప్ ముందే ఇన్స్టాల్ చేసినట్టుగా నిర్ధారించుకోవాలని మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించింది. ముందుగా ఇన్స్టాల్ చేయబడిన సంచార్ సాథి అప్లికేషన్ సెటప్ సమయంలో వినియోగదారులకు సులభంగా కనిపించేలా, అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే తయారు చేసిన ఫోన్ల కోసం, ఫోన్ కంపెనీలు యాప్‌ను సాఫ్ట్వేర్లు చొప్పించే సమయంలో సంచార్ సాథీ యాప్‌ను ప్రవేశపెట్టాలని టెలికాం శాఖ మొబైల్ కంపెనీలను ఆదేశించింది.
ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. బిగ్ బ్రదర్ కూడా గమనించలేనంతగా, వ్యక్తి గోప్యతకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిందని ఇప్పుడు ఎందుకు ఇలాంటి యాప్స్ ద్వారా ప్రజల హక్కులను కాలరాస్తారని X పోస్ట్‌లో ఆయన ఆక్షేపించారు. ఈ యాప్ ద్వారా ప్రతి పౌరుడి కదలికలు కేంద్ర నిఘా పరిధిలోకి వస్తాయని, ప్రీ-లోడెడ్ ప్రభుత్వ యాప్ ప్రతి భారతీయుడిని పర్యవేక్షించడానికి ఒక డిస్టోపియన్ సాధనమని దుయ్యబట్టారు.
మొబైల్ నెట్‌వర్క్‌లు వైఫైలా వ్యక్తి చుట్టూ ఉండేలా నాడు మొబైల్ ఆపరేటర్లు ప్రచారం చేస్తే తాజాగా కేంద్రం తీసుకొచ్చిన యాప్ ద్వారా ప్రతి పౌరుడిపై ప్రతిక్షణం కేంద్రం నిఘా ఉంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంచార్ సాథీ యాప్‌ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశారు. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం కేంద్రం తీరును నిరసించారు. ఇది వ్యక్తుల పాలిట బిగ్ బాస్ అంటూ విరుచుకుపడ్డారు. యాప్ ద్వారా వ్యక్తిగత ఫోన్లలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం ఇలాంటి చీకటి పద్ధతులను అవలంబించడం హేయమన్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఐ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్‌తో గొడవకు దారితీసే అవకాశమున్నట్టు రాయటర్స్ రిపోర్ట్ చేసింది. గతంలోనూ గోప్యత, భద్రతా ప్రమాదాలను పేర్కొంటూ ఇటువంటి ఆదేశాలను యాపిల్ వ్యతిరేకించింది. ఆపిల్, శామ్సంగ్, షియోమి సంస్థలు కేంద్ర నిర్ణయంపై స్పందించాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మాత్రం స్పందించలేదు.
ఈ ఆదేశాన్ని జారీ చేసే ముందు ప్రభుత్వం ఫోన్ తయారీదారులను సంప్రదించలేదని తెలుస్తోంది. సంచార్ సాథీ వెబ్సైట్ ప్రకారం, ఈ యాప్ 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేయగలిగిందని, 26 లక్షల ఫోన్లను రికవరీ చేయగలిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో సంచార్ సాధీ యాప్ కోటి కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్లలో, 10 లక్షల iOS ఫోన్లలో డౌన్లోడ్లు సాధించిందని సంస్థ వెబ్సైట్ చెబుతోంది.



