జాతియం

Karnataka: కర్ణాటకలో డిసెంబర్ 1కి ముందు సిద్ధరామయ్య–డీకే శివకుమార్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం

Karnataka: అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుకా, వెనక్కా అన్నట్టుగా సాగుతోంది. ఓవైపు రాజకీయ కురువృద్ధుడు సిద్ధరామయ్య, మరోవైపు రాజకీయ చాణక్యం తెలిసిన డీకే శివకుమార్ ఇద్దరి మధ్య సీఎం పీఠం చిచ్చు పెడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా కొనసాగాలని సిద్దూ ట్రై చేస్తుంటే, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పడన్న చందంగా డీకే రేసులో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే డీకేకు సీఎం పీఠం అప్పగించాలంటూ ఎమ్మెల్యేలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కల్లోలాలను ఎదుర్కొంటున్న హస్తం పార్టీ ఇప్పుడు కర్నాటక రూపంలో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. కర్నాటక సంక్షోభానికి తెరదించాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తుందా.. ఇలాగే నేతలు కొట్టుకు చావాలని చూస్తుందా అన్నది మాత్రం అర్థం కావడం లేదంటున్నారు పార్టీ నేతలు. అందుకే కొందరు వయా మీడియాగా ఏం చేస్తే ఏమవుతుందోనన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.

డిసెంబర్ 1 న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కర్నాటక రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పూర్తి క్లారిటీ రానుంది. ఈచర్చలు ఇవాళ గానీ రేపు గానీ జరిగే అవకాశం ఉంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరినీ నవంబర్ 28 లేదా 29 తేదీల్లో ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్గత కల్లోలాన్ని పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

అధికార పంపిణీపై రెండు వైపుల నుంచి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆందోళనలో ఉంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కర్నాటకపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలనుకుంటోంది. దక్షిణాదిలోని పార్టీకి గట్టి పట్టున్న కర్నాటకలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు కొట్టుకు చావడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని హైకమాండ్ వర్రీలో ఉంది. ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థికి అవకాశమిచ్చినట్టవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

అదే సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం నాయకత్వ మార్పుపై నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది హైకమాండేనంటున్నారు. ఢిల్లీకి ఎమ్మెల్యేలు వెళ్లడం గురించి మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానిమిచ్చారు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి స్వేచ్ఛగా ఉందని, ఆ విషయాలన్నీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఎవరేం చెప్పాలనుకున్నా, దానిని హైకమాండ్‌కు చెప్పనివ్వడానికి వచ్చిన ఇబ్బందేం లేదన్నారు. మరోవైపు తాను సీఎం పీఠం ఇవ్వాలని కోరలేదంటున్నారు డీకే శివకుమార్.

2023 ఎన్నికల తర్వాత అధికార పంపిణీకి సంబంధించి తనకు, సిద్ధరామయ్యకు, కాంగ్రెస్ నాయకత్వాని మధ్య ఒప్పందం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటి ఒప్పందం ఏదైనా జరిగుంటే అది ఐదారుగురు వ్యక్తుల మధ్య రహస్యమని… దానిని తాను బహిర్గతం చేయాలనుకోవడం లేదని చెప్పారు. పార్టీని ఇబ్బంది పెట్టడం లేదా బలహీనపరచడం తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు. తన లక్ష్యం 2028, 2029 ఎన్నికలని శివకుమార్ తేల్చి చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారన్నదీ తనకు తెలియదన్నారు.

అంతిమంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏం చెబితే అదే జరిగే అవకాశముంది. ఆయన నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండే అవకాశం ఉంది. సీఎం సన్నిహితులు మాత్రం రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్యను మార్చే ఉద్దేశం లేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేల మద్దతుందని వారు చెబుతున్నారు. సిద్ధరామయ్య శిబిరం కనీసం మార్చి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను సిద్దూ కోరుకుంటున్నప్పటికీ, శివకుమార్ మద్దతుదారులు మాత్రం, ముందుగా అనుకున్న ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు.

అయితే, రామ్‌నగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్, డికె శివకుమార్ విధేయులు శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని బహిరంగంగా ప్రకటించడం పార్టీలో ఏదో జరుగుతోందన్న వాదనను బలపరుస్తున్నాయి. 200 శాతం, డీకే త్వరలోనే సీఎం అవుతారని, హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పవర్ షేరింగ్ ఫార్ములాను ఉభయపక్షాలు అంగీకరించాయని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button