జాతియం

PM Modi: త్వరలో మోడీ కేబినెట్ ప్రక్షాళన?

PM Modi: ఏదైనా ఆల్ ఆఫ్ ద సడెన్ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంటాయ్. సైలెంట్‌గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం. తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ కేబినెట్ ప్రక్షాళన అంశం చర్చనీయాంశమవుతోంది. పార్లమెంట్ సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో సాధారణంగా కేబినెట్‌లో మార్పులు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం. ఒక్కసారి 25 మంది మంత్రులను బయటకు పంపే అవకాశం ఉందన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో నుంచి విన్పిస్తోంది.

ఎవరు బయటకు? ఎవరు లోపలకు? అన్నదానిపై ఇథమిద్ధంగా సమాచారం లేనప్పటికీ వారిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 15 మంది వరకు సహాయ మంత్రులు జాబితాలో ఉన్నారని అంటున్నారు. 25 మంది తొలగింపు ఖాయమంటూ ఢిల్లీలో చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం.

దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్నవారిని మార్చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేవాలని పార్టీ ఆలోచిస్తోందట. ఐదారు సార్లు గెలిచిన, తమ ప్రాంతాల్లో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశమివ్వాలన్న చర్చ పార్టీలో సాగుతోంది. ప్రక్షాళనను తుది నిర్ణయానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామ్యమైందన్న వార్తలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు, ప్రాంతీయ సమీకరణలు, భవిష్యత్ ఎన్నికలు పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణనలో ఉన్నాయని సమాచారం.

తాజా కేబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ, ఏపీలో సస్పెన్స్ పెరిగింది. దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళలో, తెలంగాణ–ఏపీలో కూడా కేబినెట్ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్‌కు కేబినెట్‌లో చోటు లభించవచ్చంటున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి స్వల్ప మార్పులు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ధర్మపురి అర్వింద్‌కు పార్టీ ఆహ్వానం కూడా చర్చనీయాంశమవుతోంది.

కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడానికి, కొన్ని ప్రాంతాల్లో 2026, 2027 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో BJP ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, బెంగాల్ నుంచి ఒకరిద్దరికీ కేబినెట్‌లో బెర్త్ ఖాయమని తెలుస్తోంది. ఇదే సమయంలో, తొలగించే వారిని పార్టీ పనులకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తొలగించిన వారు ఇకపై పార్టీ కోసం పని చేయాల్సి ఉంటుంది.

ఐతే కేబినెట్ ప్రక్షాళన, పునర్వ్వస్థీకరణకు సంబంధించి ఎలాంటి సమచారం మాత్రం బయటకు పొక్కడం లేదు. దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడటానికి బీజేపీ అగ్రనేతలు ఇష్టపడటం లేదు. మొత్తంగా కేబినెట్ ప్రక్షాళన ఈసారి సాధారణ మార్పులు కాదు. భారీ, సంచలనాత్మక, కీలకమైన, ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక మార్పులుండొచ్చని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button