India-US: భారత్, అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం

India-US: భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రత సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇరుదేశాలు శుక్రవారం 10 ఏళ్ల కాలానికి కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్-అమెరికాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కౌలాలంపూర్‌లో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు.
అంతకుముందు అనేక అంశాలపై చర్చలు జరిపారు. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించాక రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ఠం చేసే క్రమంలో విస్తృత స్థాయి దార్శనిక పత్రంలా, విధానపరమైన మార్గదర్శిగా ఇది ఉపయోగపడనుంది. 2015లో కుదిరిన ఇలాంటి ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇది అనివార్యమైంది.



