తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో 15 మందిపై చర్యలు నిలిపివేత

Tirumala: తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో 15 మందిపై చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశింది. ఆరోపణలు రుజువు కాకపోవడంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కోటి 5 గ్రాములు ఉండే 300 బంగారు నాణేలు దుర్వినియోగమైనట్లు 2006లో అప్పటి ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి విచారణ జరిపి 2008లో నివేదిక ఇచ్చారు. 15.40 లక్షల విలువైన డాలర్ల దుర్వినియోగంలో బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేశారు. దీని ఆధారంగా వారిపై అభియోగాలు నమోదు చేశారు.
కేసును కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించారు. అభియోగాలేవీ రుజువు కాలేదని విచారణ అథారిటీ తేల్చింది. దీంతో తదుపరి చర్యలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్ ఉత్తర్వులు జారీచేశారు. టీటీడీ ఆలయ ఓఎస్డీగా పనిచేస్తూ 2021లో మరణించిన డాలర్ శేషాద్రిపై ఇదే కేసులో అభియోగాలు నమోదయ్యాయి. అప్పట్లో ఈ డాలర్ల దుర్వినియోగంపై సీఐడీ విచారణ కూడా జరిగింది.



