అంతర్జాతీయం

H-1B వీసా నియమాలను మరింత కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్

అమెరికాలో పని చేయాలనుకునే భారతీయ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, రీసెర్చ్ ఫెలోస్‌కు ట్రంప్ షాక్ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే, H-1B వీసా ప్రోగ్రామ్‌పై మార్పులు తెచ్చిన ట్రంప్ సర్కారు తాజాగా వీసా ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన లక్ష డాలర్లు తప్పనిసరి ఫీజు ప్రకటించడంతో వీసాలను క్రమబద్ధీకరించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయ్. కొత్తగా అప్లై చేయడం కూడా తగ్గినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యజమానులు వీసాలను ఎలా వినియోగించాలో, ఎవరు అర్హులు అనేదానిపై మరిన్ని నియంత్రణలను అమెరికా విధించబోతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, తాజాగా H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా వర్గీకరణ కార్యక్రమాన్ని సంస్కరించడమనే పేరుతో ప్రతిపాదనను నమోదు చేసింది. ఈ మార్పులు వీసా మినహాయింపుల అర్హతను సవరించడం, నియమ ఉల్లంఘన చేసిన యజమానులపై అదనపు పరిశీలన, థర్డ్ పార్టీ నియామకాలపై కఠిన పర్యవేక్షణ వంటి అంశాలను కలిగి ఉన్నాయి. ఏ యజమానులు వీసా క్యాప్ మినహాయింపుకు అర్హులు కావాలి, ఎవరు కాదన్నదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

కానీ, న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం, ఈ మార్పులు జరిగితే ఇప్పటి వరకు లాభపడుతున్న విశ్వవిద్యాలయాలు, లాభాపేక్షలేని పరిశోధనా సంస్థలు, ఆసుపత్రులు వంటి సంస్థలు తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. ప్రతిపాదన ప్రకారం, ఈ మార్పులు H-1B వీసా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి, అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ పరిస్థితులను రక్షించడానికి ఉద్దేశించబడ్డాయని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా, ఈ చర్యలు భారతీయ విద్యార్థులు, యువ నిపుణుల కలలను కల్లలలు చేసే ప్రమాదం ఉంది. అమెరికాలో ప్రతి ఏడాది 65 వేల H-1B వీసాలు మాత్రమే జారీ అవుతాయి.

అదనంగా, అమెరికా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ కలిగిన వారికి 20 వేల అదనపు వీసా మినహాయింపులుంటాయి. ఈ వీసాలను లాటరీ ద్వారా కేటాయిస్తారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, 2023లో ఆమోదించబడిన H-1B దరఖాస్తుల్లో దాదాపు మూడో వంతు భారతీయులే ఉన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో 60% వీసాలు కేటాయించారు. ఆసుపత్రులు, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు కూడా ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button