అంతర్జాతీయం

Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన సోదరి

Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో ఆయన ఓ సంచలనం.. క్రికెటర్ గా.. కెప్టెన్ గా పాకిస్థాన్ కు సేవలు అందించిన ఇమ్రాన్ ఖాన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రికెట్ క్రేజుతో రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. ప్రధానిగా సంచలన నిర్ణయాలతో వివాదాస్పద రాజకీయ నాయకుడిగా ముద్రవేసుకున్నారు. అవినీతి ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తింటున్నాడు. ఆఖరికి జైల్లో ఆయన్ని హత్య చేసారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకీ.. ఇమ్రాన్‌కు ఏమైంది..? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది..? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు..?

పాకిస్తాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది. క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో ఆయన శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాలా జైలు ముందు పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ముగ్గురు చెల్లెళ్లు నిరసన తెలిపారు.

గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన సోదరీమణుల్ని, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రిని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉందని, ఇమ్రాన్ ఖాన్ ను చంపేసి ఉంటారని చాలా మంది బలంగా నమ్మారు. దీంతో రావల్పిండిలో ఇమ్రాన్ ఖాన్ సానుభూతి పరులు నిరసనలకు దిగారు. దీంతో పాక్ ప్రభుత్వం 144 సెక్షన్ కూడా విధించింది.

ఇక అడియాల జైలువద్ద ఆందోళనకు దిగడంతో పోలీసు బలగాలతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులను కట్టడి చేశారు. ఈక్రమంలో ఇమ్రాన్ అక్కా చెల్లెళ్లపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఆచూకీ తెలపాలని ఆయన కుమారుడు ఖాసీంఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఇమ్రాన్ ను నేరుగా కలవనివ్వడంలేదని, పోన్లోనూ మాట్లాడించలేదన్నారు. రాజకీయ కుట్రతో తండ్రిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరారు.

తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ప్రభుత్వం ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు తోడు పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ సెనెటర్ ఖుర్రం జీషాన్ వ్యాఖ్యలతో షెహబాజ్ షరీఫ్, ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇమ్రాన్ ఖాన్‌ను దేశం నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడానికి ప్రత్యేక నిర్బంధంలో ఉంచుతున్నారని జీషాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణకు ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయన ఫోటోలు లేదా వీడియోలు విడుదల చేయడంలేదని విమర్శించారు.

ఈ క్రమంలో పాక్ సర్కారు ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అనుమతించింది. దీంతో కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ మరణంపై వస్తున్నరూమర్స్ కు తెరపడింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అధికారులు అనుమతించారు. దీంతో ఆమె కొద్దిసేపు ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడారు. తన సోదరుడితో భేటీ తర్వాత ఉజ్మాఖాన్ జైలు బైట తన సోదరుడి జైల్లో బతికే ఉన్నాడని చెప్పారు. అయితే ఈ ప్రకటనతో ఆయన మరణ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

ఇమ్రాన్ ఖాన్ జనాదరణకు పాక్ ప్రభుత్వంవణికిపోతుందని చెప్పుకొచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌ను మానసికంగా హింసిస్తున్నారని ఉజ్మా తెలిపింది. అతడిని ఏకాంత నిర్బంధంలో ఉంచారని, ఆయన బాగానే ఉన్నాడని చెబుతూ, మరణం పుకార్లకు చెక్ పెట్టింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఎవరితో కలవనివ్వడం లేదని, వారు మానసికంగా హింసిస్తున్నారని, ఆయన కోపంతో ఉన్నారని, జరుగుతున్న ప్రతీ దానికి అసిమ్ మునీర్ బాధ్యుడని ఆయన అన్నట్లు ఆమె చెప్పారు. ఎప్పటికైన ఆయన మరల తిరిగి వస్తారని ఇమ్రాన్ ఖాన్ పై తమకున్న అభిమానంను చాటుకుంటున్నారు.

మరోవైపు 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత అనూహ్యంగా నమోదైన అవినీతి కేసుల కింద 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరణలు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇస్లామాబాద్, రావల్పిండి లో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు.

పాక్ ప్రభుత్వం సమావేశాలను నిషేధించడంతో పాటు రావల్పిండిని సైన్యం, పోలీసులతో నింపేసింది. ఆయన మరణంపై తొలిసారిగా వదంతులు అఫ్గన్ సోషల్ మీడియాలో వచ్చాయి. అప్పటి నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలకూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.

అయితే ఉజ్మా ఖాన్ భేటీకి అనుమతి లభించినప్పటికీ, అడియాలా జైలు పరిసర ప్రాంతాలను హై అలర్ట్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో ఐదు అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జైలు వద్ద గత వారం రోజుల నుంచి నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, అల్లర్లను అదుపు చేసే సామగ్రితో 700 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

పుకార్ల నేపథ్యంలో అడియాలా జైలు పరిపాలనతో పాటు ప్రభుత్వం కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు పూర్తి వైద్య సహాయం అందుతోందని తెలిపారు. ఆయనను అడియాలా జైలు నుంచి తరలించారనే వార్తల్లో నిజం లేదు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని అడియాలా జైలు ఒక ప్రకటనలో తెలిపింది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఒక ఫొటోను కూడా విడుదల చేశాయి. దీంతో ఇమ్రాన్ మరణ వార్త పుకార్లు పాకిస్తాన్‎లో వేగంగా వ్యాపించి పీటీఐ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఇమ్రాన్‎ను చూపించాలని అడియాలా జైలు ముందు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు దిగొచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం జైల్లో ఇమ్రాన్ ఖాన్‎ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇమ్రాన్ మరణ పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button