Adluri Laxman Kumar: బీఆర్ఎస్‌కు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రకాల్చి వాత పెట్టారు

Adluri Laxman Kumar: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రకాల్చి వాత పెట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి బీఆర్ఎస్ నాయకులు బొక్కబోర్ల పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న ఆదరణకు ఈ గెలుపే నిదర్శనమన్నారు. ఈ గెలుపుతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఓటమిని అంగీకరించలేక బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బుద్ధితెచ్చుకొని తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.



