కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. లడాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువతను అదుపు చేసే క్రమంలో పోలీసులు, సీఆర్ పీఎఫ్ బలగాలు, ఆందోళన కారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ లడాఖ్ యువత ఎందుకు ఆందోళను చేస్తోంది..? అశాంతి వెనక ఉన్న వారి డిమాండ్లు ఏమిటీ..?
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లో ఒక్కసారిగా నిప్పు రగిలింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్‌పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.
ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 90 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. ఈ సంఘటనలు లద్దాఖ్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను మరింత ఉద్గ్రహించాయి. అధికారులు లేహ్‌లో కర్ఫ్యూ విధించి, భద్రతా బలగాలను మరింత బలోపేతం చేశారు.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు.
ఒకప్పుడు ఉమ్మడి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమైన లద్దాఖ్ 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. దీంతో ఈ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. ఇక్కడ శాసనసభ కూడా లేదు. జమ్మూకశ్మీర్ నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని అప్పట్లో లద్దాఖ్ ప్రజలు స్వాగతించారు. కానీ రాష్ట్ర హోదా కావాలన్న ఆకాంక్ష వారిలో ఇటీవల మొదలైంది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో లేహ్ అపెక్స్ బాడీకి సంబంధించిన యువజన సంఘం పోరాడుతోంది.
లద్దాఖ్ పర్యావరణాన్ని, సహజ వనరులను, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి గిరిజనుల హక్కులను కాపాడుకొనేందుకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు అవసరమని స్థానికులు తెలిపారు. రాష్ట్ర హోదా కోసం ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుచుక్ సహా 15 మంది ఈ నెల 10న నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.
రాష్ట్ర హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఎల్‌ఏబీతోపాటు కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ సభ్యులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ 6న మరోదఫా చర్చలు జరగాల్సి ఉంది. ఇంతలోనే హింస చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నిరాహార దీక్షలు కొనసాగుతుండడం, మరోవైపు లద్దాఖ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో అక్టోబర్ 6 కంటే ముందే చర్చలు జరపాలని ఆందోళనకారులు తేల్చిచచెప్పారు.
రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌ను విస్తరించడం, లేహ్, కార్గిల్‌కు ప్రత్యేక లోక్‌సభ స్థానాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కేంద్రం తక్షణమే తమతో చర్చించాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ లేహ్ బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో వందలాది మంది యువత లేహ్‌కు తరలివచ్చారు. తొలుత బీజేపీ ఆఫీసు వద్ద గుమికూడారు. ఆఫీసుకు నిప్పుపెట్టారు. ఫర్నిచర్‌ను దహనం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో హింస మొదలైంది.
సెప్టెంబర్ 10 నుంచి 35 రోజుల పాటు LAB కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కు దిగారు. రాబోయే హిల్ కౌన్సిల్ ఎన్నికలకు ముందు లడాఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కిందకు తీసుకువస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరారు. అయితే కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో నిరాహార దీక్ష కొనసాగించారు. అయితే తాజా హింసాకాండ నేపథ్యంలో సోనమ్ వాంగుచుక్ తన 15 రోజుల నిరాహార దీక్షను విరమించారు.
ఘర్షణలకు దూరంగా ఉండాలని తన అనుచరులకు సూచించారు. ప్రజలపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలే లద్దాఖ్ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వాంగుచుక్ వెల్లడించారు. ఇది జెన్–జెడ్ విప్లవం అని అన్నారు. ఇన్నాళ్లూ శాంతియుతంగా పోరాడినా ఎలాంటి ఫలితం లేకపోవడం వల్లే యువత ఆగ్రహానికి గురై హింసకు దిగారని చెప్పారు.
అయితే.. తాజా పరిణామాలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ లద్దాఖ్ ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. వారి అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం దగా చేసిందని, అందుకే రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కేంద్రం తెలుసుకోవాలన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం తాము శాంతియుతంగా పోరాడుతున్నామని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా కల్పించాల్సిందేనని ఒమర్ అబ్దుల్లా తేల్చిచెప్పారు.
రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరంలో గిరిజనులకు ప్రత్యేక రక్షణలు లభిస్తున్నాయి. అటానమస్ జిల్లా కౌన్సిళ్ల ద్వారా స్వయం ప్రతిపత్తి దక్కుతోంది. భూములు, అడవులు, స్థానిక పాలనపై గిరిజనులే చట్టాలు చేసుకోవచ్చు. గిరిజనులు హక్కులు, సంప్రదాయాలు, స్వయం పాలనను కాపాడేందుకు ఆరో షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. లద్దాఖ్‌లో గిరిజనుల జనాభా ఏకంగా 97 శాతం ఉంది. తమ హక్కులు, స్వయం పాలన కోసం ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని లద్దాఖ్ ప్రజలు పట్టుబడుతున్నారు.
రాష్ట్ర హోదా కోసం జరిగిన నిరసనల సందర్భంగా హింసాకాండ, ప్రాణనష్టం సంభవించడానికి స్వార్థపర శక్తులు బాధ్యులని లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఆరోపించారు. మరింత రక్తపాతం జరగకుండా నివారించేందుకు లెహ్ జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధించినట్లు ఆయన తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించామని, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియచేస్తున్నానని ఆయన తెలిపారు. మరిన్ని మరణాలు సంభవించకుండా నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారు. హింసను ఏ రూపంలోనూ సహించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. అరాచక శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
మరోవైపు లద్దాఖ్‌లో చోటు చేసుకున్న అల్లర్లపై కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపింది. సాయంత్రానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపింది. రెచ్చగొట్టే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఎవరూ షేర్ చేయొద్దని హెచ్చరించింది. లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించింది. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోంశాఖ తన ప్రకటనలో తెలిపింది.
అయితే లద్దాఖ్‌లో జరిగిన నిరసనలను జనరల్ జెడ్ నాయకత్వంలో నిర్వహించినట్లు చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్యాప్తులో అది జనరల్ జెడ్ నిరసన కాదని, కాంగ్రెస్ నిరసన అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కౌన్సెలర్ పుంట్సోగ్ స్టాంజిత్ తెపాగ్ ఈ అల్లర్లలో పాల్గొన్నట్లు అతడు, అతని కార్యకర్తలు హింసను ప్రేరేపిస్తున్నట్లు అనేక ఫొటోలు తమ దృష్టికి వచ్చాయని బీజేపీ అంటోంది.
అతడు చేతిలో ఆయుధంతో బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్తున్నట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. జనసమూహాన్ని రెచ్చగొడుతూ బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీ ప్రదర్శించిన ఫొటోలు, వీడియోల ఆధారంగా స్థానిక పోలీసులు తెపాగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.



