Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి

Bangladesh: బాంగ్లాదేశ్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కేవలం మత ప్రాతిపదికన జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరాయి. షరియత్ పూర్ జిల్లాలో ఖోకాన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై జరిగిన అమానుష దాడి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. .
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. షరియత్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. షరియత్‌పూర్‌లో ఓ ఫార్మసీ నిర్వాహకుడైన ఖోకన్‌దాస్ తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్తుతుండగా దాస్‌పై దుండగులు దాడి చేశారు. పలుమార్లు పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా సమీపంలోని చెరువులోకి దూకాడు.
రక్షించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతుండగా.. గత 2 వారాల్లో దేశంలోని హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య అనంతరం హింస చెలరేగింది. ఈ క్రమంలో హిందూ వ్యక్తులు దీపూచంద్రదాస్, అమృత్ మండల్ వేర్వేరు ఘటనల్లో హత్యకు గురికాగా.. మరో ఘటనలో బజేంద్రబిశ్వాస ను అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు.
మారణాయుధాలతో నరికి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ ఘటనను వివరిస్తూ బాధితుడి భార్య సీమా దాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా తమకు ఎవరూ శత్రువులు లేరని, హిందువులమనే ఒకే ఒక్క కారణంతో తన భర్తపై దాడికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలను రక్షిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో హిందువులపై నిరంతర శతృత్వం కొనసాగుతోందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగాయని మానవ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మతోన్మాదులకు ప్రభుత్వం పరోక్షంగా కొమ్ముకాస్తోందని విమర్శలు వస్తున్నాయి.



