Thane: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు

Thane: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయింది. బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ వాహనం గాల్లో ఎగిరి కిందపడింది. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. థానె జిల్లాలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యారు.
దీంతో వాహనం నియంత్రణ కోల్పోయి ముందున్న బైక్‌లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి బైక్‌తో సహా ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ షిండే, మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న కిరణ్ చాబేను స్థానికుల బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.



