ఆంధ్ర ప్రదేశ్

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని కన్నుమూత

ఏపీ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌.. ఆళ్ల నాని కన్నుమూశారు. విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఆళ్ల నాని మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ఏలూరుకు చెందిన ఆళ్ల నాని.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు.

కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. 1994, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబికా కృష్ణపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ ఏలూరు నుంచి గెలిచి తన రాజకీయ పట్టు నిరూపించుకున్నారు.

2013లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఆళ్ల నాని.. 2014లో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆళ్ల నానికి కీలక బాధ్యతలు దక్కాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆళ్ల నాని ఇక లేరన్న వార్త రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button