లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉధంపుర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో ఈ విషాదం జరిగింది.
కొండ ప్రాంతంలోని ఒక ప్రదేశానికి వెళ్తుండగా, మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు దుర్మరణం పాలయ్యారని అధికారులు ధ్రువీకరించారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే ప్రమాద స్థలం నుంచి బయటకు తీశారు.
గాయపడిన 10 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. ఉధంపుర్ డిప్యూటీ కమిషనర్ అభ్యర్థన మేరకు, తీవ్రంగా గాయపడిన వారిని తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు.



