ఉమ్మడి వరంగల్లో యూరియా కష్టాలు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రైతాంగానికి యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా ఎప్పుడు వస్తుందా అని సొసైటీల ముందు అన్నదాతలు పడిగాపులు పడాల్సి వస్తోంది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేసే సమయం మించి పోతుండటంతో ఇన్నాళ్లు పడ్డకష్టం వృథా అయిపోయి పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు.
గూడూరు మండలంలో యూరియా కోసం రైతన్నలు వేకువ జామునే సొసైటీల ముందు రెండు కిలోమీటర్ల మేర లైన్ కట్టారు. వేల సంఖ్యలో రైతులు లైన్లో ఉన్నప్పటికీ వచ్చిన యూరియా మాత్రం వందల మందికి కూడా సరిపోకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో రైతుకు దాదాపు పదుల సంఖ్యలో యూరియా బస్తాల అవసరం కాగా వచ్చిన లోడ్ కేవలం 900 బస్తాలు మాత్రమేనని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి వారిని లైన్లో ఉంచాల్సి వచ్చింది. వ్యవసాయ పనులు మొదలై రెండు నెలలు అవుతున్నా అధికారులు, పాలక ప్రభుత్వాలు యూరియా తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని దుమ్మెత్తి పోస్తున్నారు.



