అంతర్జాతీయం

India-Russia: ‘ఎక్సర్‌సైజ్‌ జాపడ్‌’ పేరుతో భారత్‌-రష్యా సైనిక విన్యాసాలు

India-Russia: ఒకప్పటి దోస్తానా ఆ ఎమోషనే వేరు. అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వచ్చినా ఎవరో ఒకరు తగ్గుతారు. ఎవరు నెగ్గినా ఇద్దరూ సంతోషపడతారు. ఇద్దరు మనుషుల మధ్యే కాదు అలాంటి ఎమోషనల్ ఫ్రెండ్ షిప్ రెండు మధ్య దేశాల మధ్య కూడా ఉంటుంది. అందుకు భారత్, రష్యా రిలేషనే ఎగ్జాంపుల్. రష్యాతో మన దేశానికి ఉన్న సంబంధాలు ఇవాళ్టి కావు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే భారత్ తో సన్నిహితంగా ఉంటోంది మాస్కో. పేరున్న దేశాల్లో మనకు అండగా ఉన్న దేశం కూడా రష్యానే. కాకపోతే మన దౌత్య విధానమే సెపరేట్. రష్యాతో ఎంత మంచి సంబంధం ఉన్నా స్వయంప్రతిపత్తితో ముందుకెళ్తోంది భారత్.

ట్రంప్‌ భారత్‌పై విధించిన అదనపు సుంకాలు, ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా నిర్ణయం తీసుకున్న భారత్, రష్యాలు మాత్రం వెనకాడడం లేదు. ట్రంప్‌ను లెక్కచేయకుండా బంధాన్ని కొనసాగిస్తున్నారు. నువ్వేంత అన్నట్లుగా సహాయ సహాకారాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇంతకీ ట్రంప్ పిచ్చిచేష్టలే రష్కా-భారత్ బంధాన్ని దగ్గర చేస్తున్నాయా..? అందుకు నిదర్శమే ఎక్సర్‌సైజ్‌ జాపడ్‌ సైనిక విన్యాసాలా..? ఇంతకీ జాపడ్ అంటే ఏంటి..?

భారత్ కు రష్యా అత్యంత ఆత్మీయ దేశం. అగ్రరాజ్యమైన అమెరికాకు దూరంగా ఉంటూ వస్తున్న భారత్.. రష్యాతో మాత్రం హెల్దీ రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తోంది. అమెరికాతో పాటు పలు దేశాలు రష్యా, భారత్ బంధాన్ని డిస్ట్రబ్ చేయాలని కుట్రలు పన్నినా ఇటు భారత్, అటు రష్యా ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. భారత్-రష్యా మధ్య దౌత్య బంధం కూడా ఎక్కువే. సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా మనకు కావాల్సిన బంధువు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

భారత్, రష్యా మధ్య విభేదాలు వచ్చే పరిస్థితులు వచ్చినా దోస్తీ కంటిన్యూ అయ్యింది. రెండు దేశాలు కలిసి నడిచాయి. అనేక ఒడిదొడుకలను తట్టుకుని నిలిచాయి. ఒకరిపై మరొకరికి ఉన్న విశ్వాసం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం అందుకు కారణం. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బంధాలను బలోపేతం చేసుకుంటూ వచ్చాయి రెండు దేశాలు.

ఇలాంటి తరుణంలో భారత్‌–రష్యా బంధాలను విడగొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 50 శాతం టారిఫ్‌లు విధించారు. అంతర్జాతీయంగా అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ, భారత్ తన చిరకాల మిత్రుడు రష్యాతో స్నేహబంధాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి ఎక్సర్‌సైజ్‌ జాపడ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. రష్యాలోని నిజ్నీ నగరంలో ఉన్న ములినో ట్రైనింగ్‌ గ్రౌండ్‌లో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు వారం రోజుల పాటు ఈ కసరత్తు కొనసాగుతుంది.

ఇందుకోసం 65 మంది సభ్యులతో కూడిన భారత సైనిక బృందం ఇప్పటికే రష్యా చేరుకుంది. ఉగ్రవాద నిరోధక చర్యలు, సంప్రదాయ యుద్ధ రీతుల్లో ఆధునిక వ్యూహాలను పరస్పరం పంచుకోవడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశమని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కసరత్తు వల్ల ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడటంతో పాటు, పరస్పర విశ్వాసం, సహకారం మెరుగుపడతాయని తెలిపింది.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ కారణంగానే భారత్‌పై ఆయన 50 శాతం సుంకాలను విధించారు. ఇటీవల జరిగిన ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం ట్రంప్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలో భారత్‌పై 100 శాతం సుంకాలు విధించాలని ఐరోపా దేశాలపై కూడా ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

భారత్‌–అమెరికా ఆర్థిక సంబంధాలపై అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ, రష్యా–భారత్‌ మధ్య దీర్ఘకాలిక ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. రష్యా ఈ సందర్భంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలనే ఆశయం వ్యక్తం చేస్తున్నాయి ఇరు దేశాలు.

మరోవైపు.. భారత్‌కు రష్యా భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. భారత్‌కు రష్యా బంపరాఫర్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్‌లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే, ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు.

ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్‌ ప్రకటించడం గమనార్హం. అయితే రెండు వారాల క్రితం ఇవి రెండు ధరలు ఒకే రకంగా ఉండేవి. ఉరల్స్ చమురు ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా.. రష్యా, భారత్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఆర్థిక, రాజకీయ, రక్షణ రంగాల్లో లోతైన బంధాన్ని కలిగి ఉంది. ఏడేళ్లలో భారత్‌ నుంచి రష్యాకు ఎగుమతులు ఏడు రెట్లు పెరిగాయి, ముఖ్యంగా చమురు దిగుమతులు రికార్డు స్థాయిలో 69 బిలియన్‌ డార్లకు చేరాయి. రష్యా ఉపమిషన్‌ చీఫ్‌ రోమన్‌ బబుష్కిన్‌ ఈ సంబంధాన్ని నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించారు, ఇది పాశ్చాత్య దేశాల నీయోకాలనియల్‌ విధానాలకు విరుద్ధంగా స్వతంత్ర ఆర్థిక సహకారాన్ని సూచిస్తుంది. రష్యా భారత్‌కు తన మార్కెట్‌ను సంపూర్ణంగా తెరిచి, అమెరికా సుంకాల వల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.

అమెరికా విధించిన 50శాతం సుంకాలు అందులో 25శాతం బేస్‌ సుంకం, 25శాతం అదనపు శిక్షాత్మక సుంకం భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా టెక్సై్టల్స్, లెదర్, సముద్ర ఉత్పత్తుల వంటి రంగాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇది భారత ఎగుమతులను 40నుంచి 50శాతం వరకు తగ్గించవచ్చని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ అంచనా వేసింది.

ఈ చర్యను భారత్‌ అన్యాయం, అసమంజసం అని ఖండించింది, ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ఒత్తిడికి తలొగ్గబోమని స్పష్టం చేశారు. అయితే, భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్‌ బలంగా ఉండటంతో ఈ సుంకాల ప్రభావం 0.2–0.3శాతం జీడీపీ తగ్గుదలకు మాత్రమే పరిమితం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అలాగే.. భారత ఎగుమతులపై అమెరికా ఆంక్షల ఒత్తిడి పెంచుతున్న వేళ, రష్యా కీలక ప్రకటన చేసింది. ఒకవేళ అమెరికా మార్కెట్‌లో భారత వస్తువులకు ఇబ్బందులు ఎదురైతే, తమ దేశ మార్కెట్ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. భారత ఉత్పత్తులకు తాము స్వాగతం పలుకుతామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఏకపక్షమని, అన్యాయమని తీవ్రంగా విమర్శించింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్, రష్యా బంధం వ్యూహాత్మకంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. “పశ్చిమ దేశాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయంటే, మీరు సరైన మార్గంలోనే వెళుతున్నారని అర్థం. వారు తమ సొంత ప్రయోజనాల కోసమే చూసుకునే నయా వలసవాద శక్తుల్లా ప్రవర్తిస్తారు. స్నేహితులు ఇలా ప్రవర్తించరు” అంటూ అమెరికా తీరుపై ఆయన పరోక్షంగా చురకలు అంటించారు.

రష్యా నుంచి చమురు దిగుమతులు భారత్‌కు ఆర్థిక, శక్తి భద్రతా దృష్ట్యా కీలకమైనవి. 2022లో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత, భారత్‌ రష్యా నుంచి గణనీయమైన చమురు దిగుమతులను పెంచింది. ఇది ప్రస్తుతం దేశ శక్తి అవసరాలలో 40శాతం వాటాను కలిగి ఉంది. రష్యా ఆఫర్‌ చేస్తున్న తగ్గింపు ధరలు భారత్‌కు ఆర్థిక లాభాన్ని అందించాయి.

అదే సమయంలో రష్యాకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చాయి. ఈ దిగుమతులను నిలిపివేయడం వల్ల భారత్‌కు సంవత్సరానికి 9 నుంచి 12 బిలియన్‌ డాలర్ల అదనపు ఆర్థిక భారం పడవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక అంచనా వేసింది. రష్యా ఈ సందర్భంలో భారత్‌కు తన చమురు సరఫరాను కొనసాగించడానికి హామీ ఇచ్చింది. ఇది ఇరు దేశాల ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

రష్యా సహకారం ఇవాళ్టిది కాదు. అలా అని అమెరికాను కాదనలేకపోతోంది భారత్. ఆ రెండు దేశాలకు పడదు. వారిద్దరితో మనకు మంచి రిలేషన్ అవసరం. అందుకే స్వతంత్ర దౌత్య విధానాన్ని ఫాలో అవుతోంది భారత్. ఇది కూడా రష్యా, అమెరికాకు నచ్చడం లేదు. తాము చెప్పినట్లో లేదా తమతో కలిసి నడవాలనో కోరుకుంటున్నాయి ఆ దేశాలు. అందుకే అటు రష్యా, ఇటు అమెరికాతో జాగ్రత్తగా నడుచుకుంటోంది మోదీ సర్కార్.

రష్యా–భారత్‌ ఆర్థిక భాగస్వామ్యం అమెరికా సుంకాల ఒత్తిడి నీడలోనూ బలంగా నిలిచి ఉంది. రష్యా సంపూర్ణ మద్దతు, చమురు సరఫరా, రక్షణ సహకారం, ఎగుమతి అవకాశాలు ఈ బంధాన్ని మరింత దృఢం చేస్తున్నాయి. అమెరికా ఏకపక్ష చర్యలు భారత్‌ను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ, రష్యా–భారత్‌ సహకారం దీర్ఘకాలికంగా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button