Virat Kohli: రంజీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. స్టేడియం వద్ద తోపులాట.. పలువురికి గాయాలు

Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇవాళ ఢిల్లీ , రైల్వేస్ జట్ల మధ్య ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో.. కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అందరి చూపూ కోహ్లీ వైపే ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. స్టేడియం బయట దాదాపు 2కిలోమీటర్ల మేర క్యూలో ఫ్యాన్స్ నిల్చున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.
గేట్ నంబర్ 16 వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. సెక్యూరిటీ గార్డ్‌కు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఓ పోలీసు బైక్ కూడా ధ్వంసమైంది. ఈ ఘటనతో మైదానం వెలుపల గందరగోళ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. మరోవైపు ఓ అభిమాని కోహ్లీని కలుసుకునేందుకు భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకెళ్లాడు. అక్కడ కోహ్లీ వద్దకు వెళ్లి పాదాలను తాకాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సదరు వ్యక్తిని అక్కడి నుంచి బయటకు పంపించారు.



