Trump: సజావుగా చర్చలు.. విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒక ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ చర్చలు విఫలమైతే మాత్రం రెండు రోజుల క్రితం ఆపిన సైనిక దాడులను పునఃప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే, మిచిగాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ స్వరం మార్చారు. దౌత్య మార్గాలు ఫలించకపోతే ఇరాన్‌ను చితకబాదుతామని’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష దాడులు తాత్కాలికంగా ఆగినా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్‌లలోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ మద్దతున్న గ్రూపులే ఈ దాడులకు పాల్పడ్డాయని సౌదీ ఆరోపించింది. మరోవైపు, తాము చర్చల కోసం అభ్యర్థించామన్న వార్తలను ఇరాన్ ఖండించింది. మధ్యవర్తుల ద్వారా సందేశాలు మార్పిడి చేసుకుంటున్నామని, కానీ చర్చలు కోరడం తమ విధానం కాదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.



