మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కరరావు పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే, ఆ ప్రభుత్వం కేవలం ఒక నెల రోజులు మాత్రమే మనుగడ సాగించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచిపోయారు.
నాదెండ్ల భాస్కరరావు కేవలం మాజీ సీఎం మాత్రమే కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా, ఎన్టీఆర్ వెన్నంటి ఉండి వ్యూహకర్తగా వ్యవహరించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ సమీకరణాల వల్ల ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 1998లో కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగలిగిన శక్తివంతమైన నేతగా నాదెండ్ల గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



