Donald Trump: ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు

Donald Trump: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇరాన్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెండు వారాలకుపైగా ప్రజలు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో పోస్టు చేశారు.
ఇరాన్‌తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యూఏఈ, ఇరాక్‌తో పాటు భారత్ కూడా ఉన్నాయి. ఇరాన్లో జరుగుతున్న నిరసనలపై అమెరికా సైనిక చర్యలు చేపడుతుందనే ఊహాగానాల మధ్య ఈ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే ఇరాన్‌పై వైమానిక దాడులు కూడా ఒక ఎంపికగా ఉండొచ్చని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇప్పటికే వెల్లడించారు.
ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం, కరెన్సీ విలువ తీవ్రంగా పడిపోవడంతో గత నెల 28 నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు ప్రారంభించారు. ఈ ఆందోళనల సమయంలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 646 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పరిస్థితి రోజు రోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.



