ఆంధ్ర ప్రదేశ్

కోనసీమ మలికిపురంలో ఆరని బ్లో అవుట్‌

పచ్చని కోనసీమలో బ్లోఅవుట్‌ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, భారీగా ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 డ్రిల్లింగ్‌ సైటులో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్‌ లీకేజీ ఆరంభమైంది. పన్నెండున్నర గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇరుసుమండ సమీపంలోని మోరి-5 సైటులో 1993లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2 వేల 700 మీటర్ల లోపల కొత్త జోన్‌లోకి వెళ్లేటప్పుడు లాగింగ్‌ టూల్‌ టెస్టింగ్‌ ద్వారా బాంబింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2 వేల 500 పీడన స్థాయిలో గ్యాస్‌ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్‌ మడ్‌ పంపింగ్‌ ప్రక్రియ చేపట్టారు.

పీడన స్థాయి విపరీతంగా ఉండటం మడ్‌ పంపింగ్‌ అదుపు చేయకపోవడంతో గ్యాస్‌ భారీగా ఎగజిమ్మింది. బ్లోఅవుట్‌ ప్రివెంటర్‌ను నియంత్రించే స్థాయిని మించి అది బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బీవోపీ వద్ద రాపిడికి అగ్నికీలలు, రెండు సార్లు పేలుళ్లు జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం భగ్గుమంది.

ఓఎన్‌జీసీ బావి నుంచి గ్యాస్‌ భారీగా లీకైనప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు. 2 వేల మంది జనాభా కలిగిన ఇరుసుమండ గ్రామానికి హెచ్చరికలు జారీ చేశారు.ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి పాఠశాలలు మూసివేశారు. లక్కవరంలో మూడుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌కుమార్, ఎస్పీ రాహుల్‌మీనా, ఎంపీ గంటి హరీష్‌మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఇరుసుమండ బ్లోఅవుట్‌ నష్టం వందల కోట్లలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అగ్నికీలల్లో రిగ్, అందులోని లాగింగ్‌ టూల్, భారీ వాహనాలు కాలి బూడిదయ్యాయి. అవన్నీ డీప్‌ ఇండస్ట్రీస్‌కు చెందినవే. అగ్ని కీలలతో సమీపంలో సుమారు వెయ్యి వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

గ్యాస్‌ బావి నుంచి నిన్న మధ్యాహ్నం ఎగసిపడిన అగ్నికీలలు.. కొనసాగుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్‌ పీడన స్థాయి తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమేనని అధికార వర్గాలంటున్నాయి. బావిలో గ్యాస్‌ నిల్వలు 40 వేల క్యూబిక్‌ మీటర్ల వరకు ఉండవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు.

ఇరుసమండలో బ్లోఅవుట్‌ సమాచారం తెలిసిన వెంటనే ఓఎన్‌జీసీతో పాటు అగ్నిమాపకశాఖ అప్రమత్తమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి, స్థానికంగా రక్షణ చర్యలకు అగ్నిమాపకశాఖ రెండు అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్లతో సహా మరో నాలుగు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది.

ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్‌జీసీ కూడా అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్, మల్టీపర్పస్‌ వాటర్‌ టెండర్, మరో వాహనంతో 20 మంది అధికారులు, 60 మంది ఫైర్‌ సిబ్బందిని బ్లోఅవుట్‌ ప్రాంతానికి పంపించింది. వారికి అదనంగా మరో 20 మంది ఇంజినీర్లను నరసాపురం యూనిట్‌ నుంచి పంపించింది. వీరంతా ఘటనా స్థలంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.

బ్లోఅవుట్‌ ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడూ చల్లగా ఉండే కోనసీమ ఒక్కసారిగా వేడి గాలులతో నిండిపోయింది. ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే సమీప గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి అప్రమత్తం చేశారు.

గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఓం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో సీఎం మాట్లాడారు. సమీప గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని ఆదేశించారు. మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, ఓఎన్‌జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌కుమార్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌లతో మాట్లాడి ప్రమాద తీవ్రత, సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, సోషల్ మీడియాలో వందతులు రాకుండా కట్టడి చేయాలని, కొబ్బరి తోటల్లోకి మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్‌కళ్యాణ్‌ సూచించారు. సహాయక శిబిరాల్లో మందులు ఉంచాలని, అందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button