హైదరాబాద్ మేయర్ పీఠంపై పార్టీల గురి.. ఇప్పటి నుంచే GHMC ఎన్నికల కోసం వ్యూహాలు?

GHMC Election: విలీనం, విభజనపై గందరగోళం నడుస్తూ ఉండగానే..డీలిమిటేషన్‌పై పొలిటికల్ పార్టీలు కస్సుబుస్సుమంటుండగానే..గ్రేటర్ రూపు మారింది..ఔటర్ వరకు విస్తరించింది. మహానగర విస్తీర్ణం పెద్దగా అయిపోయింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా GHMC మారిపోతుంది. గతంలో 150 వార్డులు ఉంటే..ఇప్పుడు 3 వందల వార్డులకు పెంచడం వెనుక రేవంత్ సర్కారు పెద్ద స్కెచ్చే వేసినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కార్పోరేషన్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ఉన్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఎన్నికల ప్రక్రియను క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. గ్రేటర్‌పై రేవంత్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
రాష్ట్రంలో మరోసారి మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రేవంత్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల నగారా మోగే ఛాన్స్ కనిపిస్తోంది.
హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సీట్లన్నీ గెలుచుకున్న బీఆర్ఎస్అ దే సత్తా చూపించి GHMC ఎన్నికల్లో కూడా పైచేయి సాధించాలని ప్లాన్ చేస్తోంది. అర్బన్ ఏరియాల్లో పట్టున్న బీజేపీ ఈసారి బల్ధియా ఎన్నికలపై పెద్ద కసరత్తే చేస్తోంది. ఇక ఓల్డ్ సిటీలో బలంగా ఉన్న ఎంఐఎం మేయర్ పీఠం విషయంలో కింగ్ మేకర్‌గా ఉండేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన విధానంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణ చేపట్టింది. ఇటీవల నగర శివారు 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన సర్కార్.. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ జీవో జారీ చేసింది. ఇక అసెంబ్లీలోనూ జీహెచ్ఎంసీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అనుసరించిన పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసినట్లు తెలుస్తోంది.
దశాబ్దాలుగా హైదరాబాద్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. 2002లో జరిగిన అప్పటి ఎంసీహెచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, 2007లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసీహెచ్‌ను చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలతో విలీనం చేసి ఏకంగా 150 వార్డులతో జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. ఈ విస్తరణతో అప్పటి వరకు బలంగా ఉన్న టీడీపీ, ఎంఐఎంలు బలహీనపడ్డాయి. ఈ వ్యూహం ఫలితంగా 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
ఆ తర్వాత జరిగిన గత రెండు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. 2016, 2020 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుని పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్సార్ 2007 ఫార్ములాను మళ్లీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను ఏకంగా 300 వార్డులకు పెంచింది అందుకేననే చర్చ నడుస్తోంది. నగర పరిధిలో కాస్త బలంగా ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉండగా దాని కోసమే కొత్త వార్డులను చేర్చినట్లు తెలిసింది.
జీహెచ్‌ఎంసీ వార్డులను 300కు పెంచడం ద్వారా దాని భౌగోళిక విస్తీర్ణం 2,053 చదరపు కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ విస్తీర్ణంతో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది. ఇది ప్రస్తుత అతిపెద్ద కార్పొరేషన్లైన ఢిల్లీ , ముంబై వార్డుల కంటే కూడా విస్తీర్ణం, వార్డుల సంఖ్యలో పెద్దదిగా మారుతుంది. ఈ విస్తరణ ద్వారా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును పెంచుకోవాలని కొత్తగా విలీనం అయ్యే ప్రాంతాల మద్దతుతో మేయర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌లో పొలిటికల్ వ్యవహారాలను తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. హస్తం పార్టీ హైదరాబాద్‌లో బలహీనంగా ఉండటంతో గ్రేటర్ పరిధిలోని కొంతమంది నేతల చేరికలతో బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు, GHMC మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. మరోవైపు మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్.
బడ్జెట్‌లో ప్రత్యేకంగా 10 వేల కోట్లు కేటాయించి మూసీ సుందరీకరణ వంటి అంశాలతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పొలిటికల్‌గా కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం సపోర్ట్ లేనిదే వర్కౌట్ అయ్యే పనికాదనే ఆలోచనతో వారితో సఖ్యతగా ఉంటున్నారు. ఎంఐఎంతో కలుపుకొని వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. అవసరమైతే ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఐఎంతో కలిసి అయినా సరే మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తుంది.
ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నగర ఓటర్లు కచ్చితంగా తమవైపే ఉంటారని ఆశలు పెట్టుకుంటుంది.
ఒకవేళ మేయర్ పీఠం దక్కకపోయినా కింగ్ మేకర్‌గా ఉండాలని ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిన కమలం పార్టీ ఈసారి మరింత గట్టిగా పనిచేసి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది. చూడాలి మరి మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఏ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందనేది.



