KCR: తన అభిమాని కుమారుడికి నామకరణం చేసిన కేసీఆర్

KCR: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన అభిమాని కుమారునికి నామకరణం చేశారు. తన కుమారునికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, వారి చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలని ఎదురుచూసిన తెలంగాణ ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినాన ఫలించింది. పరిగి నియోజకవర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామ నివాసి దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమకారుడు. కాగా, నర్సింహులు–అనిత దంపతులు తమ ప్రియతమ నేత కేసీఆర్ గారి చేతుల మీదుగా తమ కనిష్ట కుమారునికి నామకరణం చేయించాలని నిర్ణయించుకున్నారు.

బాబు పుట్టిన తొమ్మిది నెలల నుంచి ఎదురుచూస్తున్న వారి ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి నాడు ఫలించింది. మంగళవారం నాడు నందినగర్ నివాసానికి వెళ్లిన దొడ్ల నర్సింహులు–అనిత దంపతులను కుటుంబసభ్యులతో కలిసి అధినేత కేసీఆర్ గారు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ ఉద్యమ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుని సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన ‘సు’ అక్షరాన్ని ఆధారంగా చేసుకుని ‘సుమన్’ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి, సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు.



