Chandrababu: అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి

Chandrababu: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వెయ్యి 592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్‌పై పరిశీలన జరిపామని స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు వివరించారు.
ప్రజలు స్క్రబ్ టైఫస్ బారినపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు.
స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సీఎం తెలిపారు.
సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.



