ఆంధ్ర ప్రదేశ్

Diviseema Cyclone @ 48 Years: నవంబర్ 19.. చ‌రిత్రలో చేదు జ్ఞాప‌కం.. దివిసీమ ఉప్పెనకు 48 ఏళ్లు

Diviseema Cyclone @ 48 Years: 1977 నవంబర్ 19. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహా విషాదం. తలుచుకొంటే గుండె జలదరించే రోజు. దివిసీమ ఉప్పెన విరుచుకుపడిన రోజు. ఆ ఉప్పెనలో 14 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దివిసీమలోనే తొమ్మిది వేల మంది మరణించారు. రూ.172 కోట్ల ఆస్తి సముద్రం పాలైంది. 1977 నవంబర్ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి క్రమేపి బలపడి నవంబర్ 19న పెను ఉప్పెనగా భీభత్సం సృష్టించింది.

మహా విషాదానికి 48 ఏళ్లు. గ్రామాలను శవాల దిబ్బగా మార్చిన రోజు 1977 నవంబర్19. దివిసీమలో వచ్చిన ఉప్పెన..గ్రామాలను ఊడ్చిపట్టుకెళ్లింది. దివిసీమ గ్రామాల్లో తాత, ముత్తాత, తండ్రి, మనవడు ఇలా తరాలకు తరాలు ఉప్పెనలో సజీవ సమాధి అయ్యారు. నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద వాయుగుండం తీరాన్ని దాటింది. గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు సముద్రపు అలలు ఎనిమిది మీటర్లు ఎత్తున ఎగసి పడ్డాయి. రాకాసి అలలు సముద్రతీర ప్రాంతాన్ని ముంచి మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. దివిసీమతో పాటు గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లెలో ప్రళయం సృష్టించి 14 వేలకు మందికి పైగా పొట్టన పెట్టుకుంది.

ఒక్క దివిసీమలోనే 9 వేలమంది మృత్యువాత పడ్డారు. దివిసీమ ఉప్పెన ఆ ఘోరకలి ఉప్పెన మీదపడి గ్రామాలకు గ్రామాలనే శవాల దిబ్బగా మార్చివేసింది. రాత్రికి రాత్రే నిద్రలోనే శవాలుగా మారిపోయారు. తల్లి పొత్తిళ్ళలో సేద తీరుతున్న చిన్నారులను రాకాసి అలలు నిద్రలోనే మింగేశాయి. ఎక్కడ చూసిన హృదయవిదారక దృశ్యాలేన్నో దివిసీమలో ప్రళయభీభత్సం సృష్టించింది. ఆ పెను ఉప్పెన మిగిల్చిన విషాదం అంతా ఇంతకాదు.

నాగాయలంక మండలంలోని సొర్లగొంది, నాచుగుంట, సంగమేశ్వరం, ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ, ఏటిమొగ, కమ్మనమోల, దీనదయాళపురం, గుల్లలమోద, నాలి, భావదేవరపల్లి గ్రామాలు, కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, బసవన్నపాలెం, గొల్లపాలెం, ఊటగుండం, ఇరాలి గ్రామాలు ఉప్పెన తాకిడికి తుడిచిపెట్టుకు పోయాయి.

సముద్రతీర ప్రాంతం నుంచి సుమారు 20కిలోమీటర్లు సముద్రం నీరు చొచ్చుకువచ్చి గ్రామాలు జల సమాధి అయ్యాయి. ఈ ఉప్పెన తాకిడికి గుట్టలు, చెట్లు పట్టుకొని కొంత మంది ప్రాణాలు కాపాడుకోగా కోడూరు మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో తలదాచుకున్న వారు మాత్రమే బ్రతకగలిగారు. కోడూరు మండలం పాలకాయతిప్పలో 460, మూలపాలెంలో 300, నాగాయలంక మండలం సొర్లగొందిలో 714 మంది భవనాలలో తలదాచుకున్నారు.

48 ఏళ్ల క్రితం సరిగ్గా నవంబర్ 19వ తేదీన వచ్చిన ఆ ఘోరకలిని దివిసీమ నేటికి మరువలేకపోతోంది. ఈ తేదీ గుర్తుకు వస్తే నేటికీ దివిసీమ గుండెల్లో వణుకుపుట్టుకు వస్తుంది. ఆ తుఫానులో 9 వేలకు మంది పైగా జల సమాధి కాగా లక్షల సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు మృత్యువాత పడ్డాయి. 170 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అప్పటి ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి.

దివిసీమ ఉప్పెన సమయంలో ముఖ్యమంత్రిగా జలగం వెంగళ్‌రావు ఉన్నారు. నాటి మంత్రివర్గ సహచరుడు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావుకు సహాయ పునరావాస శాఖ కూడా అప్పగించి దివిసీమను ఆదుకోమని ఆదేశించారు. దివిసీమ ఉప్పెనకు చలించిన తెలుగు సమాజం ఆ ప్రాంతాన్ని ఆదుకునేందుకు నడుం కట్టింది.

సినీ కళాకారులు, ఆర్ఎస్‌ఎస్, కమ్యూనిస్ట్‌ పార్టీలు, పోలీసులు, రెడ్‌క్రాస్, రామకృష్ణ మిషన్, మానవతావాదులు అందరూ దివిసీమను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు, బాధితులకు భరోసా ఇచ్చేందుకు తమ వంతు సాయం చేశారు. వెంగళరావు తర్వాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి దివిసీమలో పర్యటించి సహాయ కార్యక్రమాలు చూశారు.

అవనిగడ్డ మండలం పులిగడ్డలో నిర్మించిన పైలాన్ ఉప్పెన మృతుల ఘోరకలికి సాక్షం. ఉప్పెన మృతుల సంస్మరణార్ధం గాంధీక్షేత్రంలో ప్రతి ఏటా సంస్మరణ సభ నిర్వహించి మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button