అంతర్జాతీయం

గాజాలో యుద్ధం ముగిసింది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ నేడు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇజ్రాయెల్‌ బయలుదేరి వెళ్లారు. గాజాలో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొననున్నట్లు తెలిపారు.

మరికొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్‌ బందీలను హమాస్‌ విడుదల చేయనుంది. దీంతో రెండేళ్ల అనంతరం బందీలు విడుదల అవుతుండడంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌ తొలుత ఇజ్రాయెల్‌ చేరుకొని పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబ సభ్యులను కలవనున్నారు. అక్కడి నుంచి ఈజిప్ట్‌ వెళ్లనున్నారు. షర్మ్‌ ఎల్‌-షేక్‌లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌ సిసీ నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు. భారత్ నుంచి మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్‌సింగ్ ఈజిప్టు వెళ్లనున్నారు.

2023 అక్టోబరు 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని బందీలుగా చేసుకుంది. వారిలో కొంతమందిని హమాస్‌ విడుదల చేయగా, కొంతమందిని ఇజ్రాయెల్‌ దళాలు రక్షించాయి. మరికొంత మంది మరణించగా, ప్రస్తుతం హమాస్‌ వద్ద 48 మంది బందీలు ఉన్నారు. వారిని హమాస్‌ తిరిగి అప్పగించనుంది. అయితే వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఇక బందీల అప్పగింతకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేయనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button