అంతర్జాతీయం

Pakistan: పూటకో మాట మారుస్తున్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్

Pakistan: చెప్పేవాడు చెవిటివాడు అయితే వినే వాడు ఎడ్డివాడు అయ్యాడట.. అలా ఉంది దాయాది దేశం పాకిస్తాన్ తీరు. భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వాదనను భారత్‌ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కొత్త రాగం అందుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్‌ సాయం చేశారని, తద్వారా దక్షిణాసియాలో భారీ విపత్తును నివారించారని కొనియాడారు. ఇంతకీ పాకిస్తాన్ ఇలా పూటకో మాట మార్చడానికి కారణమేంటి..? అమెరికా పర్యటనలో ఉన్న షరీఫ్ ఇలా అనడానికి రీజన్ ఏంటి..?

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు వైట్ హౌజ్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే అంశాలతోపాటు గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం, ఉగ్రవాదంపై పోరులో సహకారం వంటి అంశాలపై చర్చించారు.

తెగువ చూపించి పాక్‌-భారత్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అధ్యక్షుడు ట్రంప్‌ సాయం చేయడంతోపాటు ముస్లిం దేశాధినేతలతో సంప్రదింపులు జరిపి గాజాలో సంక్షోభం ముగింపు, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు కృషి చేశారని ట్రంప్‌పై పాకిస్థాన్‌ ప్రశంసలు కురిపించింది.ఈ సందర్భంగా తమ దేశంలో కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికాను ప్రధాని షరీఫ్‌ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీలునుబట్టి పాకిస్థాన్‌లో పర్యటించాలని ఆహ్వానించినట్లు తెలిపింది.

ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా భారత్ కాల్పుల విరమణలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోలేదని చెప్పారు. రెండు దేశాల మధ్య సమస్యపై మూడో పక్షం మధ్యవర్తిత్వానికి భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని, కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను అడిగినట్లు వస్తున్న వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. ఇస్లామాబాద్, ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరినప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మాట్లాడుతూ, భారత్-పాక్ మధ్య సమస్యలు అన్ని ద్వైపాక్షికమే అని స్పష్టం చేశారని ఇషాక్ దార్ చెప్పారు. త్-పాక్ మధ్య సమస్యలు అన్ని ద్వైపాక్షికమే అని స్పష్టం చేశారని ఇషాక్ దార్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ అమెరికా ద్వారా వచ్చినప్పటికీ, భారత్ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, ఇది ద్వైపాక్షిక అంశమని భారత్ నొక్కి చెప్పిందని దార్ తెలిపారు.

మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ట్రంప్ పాడిన పాత రాగమే అందుకున్నారు. ట్రంపే పాక్-ఇండియా యుద్ధాన్ని ఆపారని అధ్యక్షుడి వ్యాఖ్యలను ఆయన పునరావృతం చేశారు. ఇటీవల భారత్-పాకిస్తాన్ సైనిక వివాదంలో చిక్కుకున్నప్పుడు అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అణ్వాయుధ దక్షిణాసియా దేశాల మధ్య యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపారని తెలిపారు.

ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారని ఆయన పీస్ ప్రెసిడెంట్ అని పొగిడారు. భారత్ పాక్ వారే కాకుండా కంబోడియా-థాయిలాండ్, అజర్‌బైజాన్-అర్మేనియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో-రువాండా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను కూడా మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప తీరుతో అమెరికన్లు గర్విస్తున్నారని అన్నారు.

ఇదిలా ఉంటే ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ సైనికాధికారుల విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్‌ పదే పదే స్పష్టం చేస్తోంది. ఇందులో మూడో దేశం జోక్యం లేదని ఉద్ఘాటిస్తోంది. ఇదే విషయంపై పలు వేదికలపై ట్రంప్‌ చేస్తున్న వాదనలనూ ఖండిస్తోంది. ఆపరేషన్‌ సింధూర్‌పై ట్రంప్‌ తీరును ఎండగట్టారు మోదీ. ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటనను తిరస్కరించారు.

మీకు అంత సీన్‌ లేదు అని అర్థం వచ్చేలా క్లాస్‌ తీసుకున్నంత పనిచేశారు. మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ ట్రంప్‌కి తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. జమ్ముకశ్మీర్‌పై భారత్‌-పాక్‌ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు.

మరోవైపు భారత్‌పై మరోసారి పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌ నేతలతో భేటీ వేళ ధరించిన పిన్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో ఇస్లామాబాద్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఆయన ఇప్పుడు వారిని సంతృప్తి పరిచేందుకే దాన్ని ధరించారు అన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ట్రంప్‌ సూట్‌పై అమెరికా పతాకం పిన్‌ చేసి ఉంటుంది. కానీ, పాక్‌ ప్రధాని షెహబాజ్‌, ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ తో భేటీ వేళ ట్రంప్‌ సూట్‌పై ఫైటర్‌ జెట్‌ కూడా పిన్‌ చేసి ఉంది. దీంతో భారత్‌ను ఇబ్బందిపెట్టడానికే ట్రంప్‌ అలా నర్మగర్భ సందేశం పంపారని పాక్‌ అనుకూలురు సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.

కానీ పాక్‌ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నట్లు అది భారత్‌ను వెక్కిరించడానికి కాదు. ఈ భేటీకి కొద్దిసేపటి ముందు తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో ట్రంప్‌ భేటీ అయ్యారు. చాలా రోజులుగా ఆ దేశానికి యుద్ధవిమానాల అమ్మకాన్ని అమెరికా నిలిపేసింది. తాజాగా ఎఫ్‌-16, ఎఫ్‌-35 యుద్ధ విమానాల విక్రయాన్ని పునఃప్రారంభించడంపై చర్చలు జరిగాయి. దీనికి చిహ్నంగా ట్రంప్‌ ఫైటర్‌ జెట్‌ పిన్‌ను ధరించి ఆ భేటీకి హాజరయ్యారు.

కాగా ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. అమాయకులను అతి కిరాతకంగా కాల్చి చంపారు. మతం పేరుతో మారణహోమం సృష్టించారు. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.

దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఆపరేషన్‌కు ప్రతి స్పందనగా, పాకిస్తాన్ సైన్యం భారత్ పై దాడికి యత్నించింది. దీంతో 2016 ఉరీ సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కంటే భిన్నంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను టెక్నాలజీ పరంగా మరింత శక్తివంతంగా, విస్తృతంగా సాగించింది. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్ ఏకంగా 24 క్షిపణులను ప్రయోగించి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తో సహా పాకిస్తాన్‌లోని 9 ప్రాంతాల్లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.

ఈ దాడుల్లో రాడార్లు, హ్యాంగర్లు, అత్యంత విలువైన ఏడబ్ల్యూఏసీఎస్ వంటి విమానాన్ని కూడా భారత సైన్యం నేలమట్టం చేసింది. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చేసింది. పాకిస్తాన్‌పై తాజా చర్య 40ఏళ్ల ఉగ్రవాదానికి ప్రతిఫలమని భారత్ చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం వణికిపోయింది. భారత్ చేస్తున్న దాడుల వర్షాన్ని తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది.

ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణపై పాకిస్తాన్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తనను సంప్రదించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆ తర్వాతే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ను సంప్రదించినట్లు చెప్పారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22వ తేదీ నుంచి కాల్పుల విరమణ ప్రకటించిన జూన్ 17వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టం చేశారు. ఈ చర్చలు సఫలం కావడంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకుంది.

అయితే భారత్‌- పాక్‌ మధ్య ట్రంప్‌ జోక్యంపై అనుమానాల నేపథ్యంలోనే ఆయన మరోసారి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌ వైపు నుంచి జోక్యంతోనే యుద్ధం ఆగిందన్నారు ట్రంప్‌. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. అదేసమయంలో.. మోదీ అద్భుతమై వ్యక్తి అంటూ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయనతో ట్రేడ్‌ డీల్‌పై ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

ఏదో అనుకుంటే మరేదో అయిందన్నట్లుగా మారింది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి. భారత్ కంట్లో నులుసులా మారి చిరాకు పుట్టించటం కశ్మీర్ మంటను లైవ్ లో ఉంచేందుకు వీలుగా కుయుక్తులు పన్నే దాయాదికి ఆపరేషన్ సిందూర్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. భారత్ ను తక్కువగా అంచనా వేసిన దానికి పాక్ ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవటమే కాదు.

కశ్మీర్ మీద మాట్లాడేందుకు అవకాశం లేని రీతిలో భారత్ రియాక్టు అవుతున్న వేళ కొత్త ఎత్తుకు సిద్ధమవుతున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. భారత్-పాక్ మధ్య సీజ్ ఫైర్‌కు అమెరికా కారణమంటూ మళ్లీ మాట మార్చేశారు. ఈ మొత్తం వ్యవహారం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి ఒక కీలక మలుపు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button