రేబిస్ సోకిందనే అనుమానంతో కూతుర్ని చంపి.. తల్లి ఆత్మహత్య

అనుమానం మానసిక రోగానికి దారి తీసింది. ఆరబోసిన పల్లీలను వీధికుక్క తినబోతుండగా అదిలించి వెల్లగొట్టిన ఓ తల్లి ఆ తర్వాత వాటిని శుభ్రపరిచి కుటుంబంలో అందరికి పంచింది. అయితే కుక్క తిన్న పల్లీలను తిన్నామని, రేబిస్ వస్తుందని భయపడిన ఆ తల్లి అదేపనిగా ఆలోచించి మతిస్థిమితం కోల్పోయింది. రేబిస్ వ్యాధితో బతకలేమని భయపడి తన కడుపున పుట్టిన మూడేళ్ల చిన్నారిని ఊపిరాడకుండాచేసి చంపేసింది. తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొడుక్కి సైతం రేబిస్ ఉందని ఆసుపత్రిలో చూపించాలని ఇంట్లోని బోర్డుపై రాసింది. తల్లి, చెల్లి బెడ్‌పై విగతజీవులుగా పడిఉండటాన్ని చూసిన కొడుకు తల్లడిల్లిపోయాడు. భార్య, కూతురు చనిపోవడంతో భర్త రోధిస్తున్నాడు. అభం శుభం తెలియని మనవరాలు శాశ్వత నిద్రలోని జారుకోవడంతో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. గృహిణి యశోద చేసిన పనికి కుటుంబం షాక్‌కు గురైంది. ఈ విషాధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



