Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీదాడి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకు పడింది. ఏకంగా 574 డ్రోన్లు, 40 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్ భూభాగంలో అమెరికా యాజమాన్యంలోని ఓ ఎలక్ట్రానిక్స్ కర్మాగారంపైనా గురిపెట్టింది. దీంతో శాంతి చర్చల్లో అనిశ్చితి మరింత పెరిగింది. మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఓవైపు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శాంతి ఒప్పందం షరతులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమేనని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లవ్రోవ్ తెలిపారు. ఉక్రెయిన్ భద్రతను కాపాడటానికి ఐరోపాయే ప్రధాన బాధ్యతను తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ తెలిపారు. భౌగోళికంగా దగ్గరగా ఉండటంతో పాటు ప్రత్యక్ష భద్రతా ప్రయోజనాల కారణంగా ఉక్రెయిన్ భద్రత విషయంలో ప్రాథమిక బాధ్యత ఐరోపాదేశాలపై ఉందని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడికి దిగడంతో శాంతి చర్చల్లో అనిశ్చితి నెలకొంది.



