తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కరికి ఒకే పదవి

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇకపై జోడు పదవులు కుదరవా..! ఒక్కరికి ఒకే పదవి అనే నిబంధన అమల్లోకి వచ్చిందా..! చట్టసభల సభ్యులుగా ఉన్నవారికి ఇక పార్టీ పదవులు రావా..! నామినేటెడ్ పోస్టులున్న వారికీ.. ఇక పార్టీ పదవుల్లో అవకాశం ఉండదా..! అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఇకపై నేతలకు ఒక్కరికి ఒకే పదవి అనే కండీషన్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు రెండు పదవులు అనుభవిస్తున్న వారు.. పార్టీ పోస్టును వదులుకోవాలంటోంది హైకమాండ్. మరి హస్తం పార్టీలో ఒక్కరికి ఒకే పదవి కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
నామినేటెడ్ పదవులలో చట్ట సభ సభ్యులుగా ఉన్న నేతలకు ఆ పదవులు దక్కవా.!? ఆ నేతల నుంచి ఆ కీలక పదవులు చేసినట్లేనా.!?
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పదవులకు సంబంధించి సీనియర్ నేతలు తెర వెనుక కసరత్తు చేస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీల్లో కీలక పదవులైన TPCC ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అనుబంధ కమిటీల నియామకం రాష్ట్ర నాయకత్వం సూచనతో అధిష్టానం చేపట్టింది.
అయితే రాష్ట్ర కమిటీలో కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకం కీలక నేతల సిఫారసుతో పీసీసీ చీఫ్ నియమిస్తారు. మరోవైపు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. వాటిని ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
మూడు మండలాలను ఒక బ్లాక్‌గా కాంగ్రెస్ పరిగణిస్తోంది. ఆయా బ్లాక్‌కి ప్రెసిడెంట్‌లను, జిల్లా ప్రెసిడెంట్‌లను, మండల, బ్లాక్, డిస్ట్రిక్ట్ కమిటీల నియామకం కోసం హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతల సూచనలు తీసుకొని నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది టీ కాంగ్రెస్. అయితే ఆయా కమిటీల్లో పాత, కొత్త నేతల మేళవింపుగా కొత్త కమిటీలు ఉంటాయనే చర్చ గాంధీ భవన్‌లో జరుగుతోంది.
ఇప్పటికే గత రాష్ట్ర కమిటీలో ఉన్న జిల్లా అధ్యక్షుల్లో 8 మంది ఎమ్మెల్యేలు, ఒకరు ఎమ్మెల్సీ, పలువురు నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్‌లుగా నియామకం అయ్యారు. అయితే చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పొందిన నేతలను DCC అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. జిల్లాలో కీలకంగా ఉన్న నేతలకు ఆ పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.
DCC అధ్యక్షులుగా కొనసాగుతున్న పలువురు కాంగ్రెస్ నేతలు 2023 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొక్కిరాల సురేఖ భర్త ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయ్యారు.
కార్పొరేషన్ ఛైర్మన్‌లుగా పొదెం వీరయ్య, చల్లా నరసింహా రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, మరికొందరు నేతలు నియామకం అయ్యారు. దీంతో వారి స్థానంలో కొత్తవారికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక తెలంగాణలో 5 నుంచి 10 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులుగా మహిళలకు అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉండటంతో మహిళా నాయకత్వాన్ని పెంపొందించాలని చూస్తోందట టీ కాంగ్రెస్. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని DCC పదవులు చేపట్టే నేతలకు ఇతర పదవులు ఉంటే పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేరని పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. మరి అన్ని DCC పదవులను కొత్తవారికి కట్టబెడతారా లేక సమీకరణాలు కుదరక ప్రస్తుతం ఉన్న కొందరిని అలాగే కొనసాగిస్తారా అనేది.. వేచి చూడాలి..



