తెలంగాణ

ఏపీ ఒక అడుగు వేస్తే.. తెలంగాణ పది అడుగులు వేస్తుంది.. నీళ్ల వివాదాలపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ముఖ్యంగా నీళ్ల సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నీళ్ల విషయంలో కోర్టుల చుట్టూ తిరగడం కంటే, రాష్ట్రాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని చెప్పారు. జల వివాదం ద్వారా రాజకీయ లాభాలు పొందాలని తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.

“పంచాయితీలు కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతా. వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కావాలని చెబుతా” అని సీఎం స్పష్టంగా చెప్పారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో అడ్డంకులు పెట్టవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రావడం ఆలస్యమవుతుందని, దాంతో రాష్ట్రంపై భారం పడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వివాదాలు కోరుకోవడం లేదని, ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తోందని అన్నారు.

పక్క రాష్ట్రాల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే ఇతర రాష్ట్రాల సహకారం అవసరమని చెప్పారు. ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే తెలంగాణ పది అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు… ఏ రాష్ట్రంతోనూ వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

సుజెన్ మెడికేర్ సంస్థ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తోందని ప్రశంసించారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందని, ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే ఉన్నారని, ఇది దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button