తెలంగాణ

Hyderabad: హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌

Hyderabad: అన్నింటికంటే పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అప్పటివరకు ముక్కూ మోహం తెలియని వ్యక్తులే ఒక్క వివాహ బంధంతో జీవితకాలం ముడివేసుకుంటారు. అలాంటి జీవితానికి ఎన్నో ఒడిదుడుగులు వస్తుంటాయి. ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ఒకరు కోపానికి పోతే మరొకరు శాంతంగా ఉండాలి. అలాంటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే జీవితం చిన్నాభిన్నమవుతుంది. వారిద్దరికే కాదు ఆ తర్వాతి తరానికి కూడా జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులే ఆవేశపడి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే వారి పిల్లల జీవితం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది..?

దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఆర్థిక ఇబ్బందులు లేవు. హాయిగా సాగిపోతున్న తమ కాపురంలో ఓ చిన్న సమస్య చిచ్చుపెట్టింది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. దీంతో ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

మియాపూర్‌కు చెందిన జంగం సందీప్‌కు, మంచిర్యాలకు చెందిన కీర్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అమీన్‌పూర్ ఠాణా పరిధి బంధంకొమ్ములోని శ్రీధమ్ హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప పుట్టినరోజు విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది.

అదేసమయంలో బయటకు వెళ్లిన సందీప్ తిరిగి ఇంటికి వచ్చేసరికి కీర్తి ఇంటి పైకప్పు సీలింగ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సందీప్.. కీర్తిని కిందకు దించాడు. తన తండ్రికి ఫోన్ చేసి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ తర్వాత అదే సీలింగ్‌కు ఉరివేసుకొని సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో చిన్నారులు మియాపూర్‌లోని సందీప్ తండ్రి వద్ద ఉన్నారు. ఇక ఘటనపై కీర్తి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button