జాతియం

PM Modi: రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌పై ప్రధాని మోదీ ఫుల్ ఫోకస్

PM Modi: ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే జపం అదే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఒకప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్న దేశాలు అత్యంత ధనిక దేశాలుగా భావించేవారు. అలాగే బంగారం నిలువలు, ఇతర ఖనిజనిక్షేపాలు ఉన్న దేశాలను కూడా శక్తివంతమైన దేశాలుగా చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అందరి చూపు రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌పై పడింది. ఎందుకంటే.. అరుదైన ఖనిజ రంగాన్ని శాసిస్తోంది డ్రాగన్ కంట్రీ కాబట్టి. సుంకాలతో విరుచుకుపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను వాటితోనే చైనా కోలుకులేని దెబ్బ కొట్టింది.

అదే ఇప్పుడు భారత్ ముందున్న మరో ముప్పు. చైనా ఏ క్షణంలోనైనా అరుదైన ఖనిజాలను ఆపేస్తే పరిస్థితి మరింత దిగజారి పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే భారత ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ చైనాకు ఓ కొత్త గుణపాఠంగానే నిలుస్తుంది. చైనా రేర్ ఎర్త్స్‌ను నిలిపివేసినా మాకేం కాదంటూ సంకేతాలు ఇచ్చారు. అసలు రేర్‌ ఎర్త్స్‌పై మోడీ ప్లాన్ ఏంటి..? చైనాను భారత్ బీట్ చేయగలదా?

నిన్నటి వరకు ఏ దేశమైనా ఏం చేయాలన్నా ఏ ప్లాన్ వేయాలన్నా చమురే కీలకం. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చమురే జీవనాడి. కానీ, ఇప్పుడు ప్రపంచ ముఖ చిత్రం మారిపోతోంది. చమురు కంటే అరుదైన ఖనిజాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఇవి లేకపోతే దేశ భద్రతకు ప్రమాదం. ఇవి లేకపోతే ఆయుధాల తయారీ ఆగిపోతుంది. రేర్‌ ఎర్త్స్ లేకుంటే కొత్త టేక్నాలజీ లేదు. ఇది అది అని కాదు సర్వ ప్రపంచం అరుదైనా ఖనిజాలతోనే నడుస్తోంది. అందుకే అమెరికా, భారత్‌ అరుదైన ఖనిజాలపై కన్నేశాయి. వాటిని కొనుగోలు, ఉత్పత్తికి కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాయి.

ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్స్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అత్యవసరమైనటువంటి ఈ మినరల్స్ భూమి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని బయటకు వెలికి తీసి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లయితే.. పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో చైనా అగ్రగామిగా ఉంది. చైనా ముఖ్యంగా వీటి ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించి, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికా సహా భారత్, యూరప్, ఇలా ప్రపంచంలోని పలు దేశాలకు రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సరఫరా చేస్తోంది.

ఇటీవల అమెరికా చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం వల్ల చైనా ఒక్క సారిగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సరఫరాను నిలిపివేసింది. దీంతో అమెరికా ఒక మెట్టు దిగి చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. .అలాగే భారత్ కూడా ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం చైనా పైనే ఆధారపడుతోంది. చైనా ప్రపంచంలో 90% రేర్ ఎర్త్ మాగ్నెట్లను తయారు చేస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే భారత్ కూడా స్వయం సమృద్ధిగా వీటిని తయారు చేసుకున్నట్లయితే, చైనా పైన ఆధారపడటం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

భారతదేశం చైనాపై ఆధారపడకుండా రేర్ ఎర్త్ మాగ్నెట్ రంగంలో స్వీయ సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రేర్-ఎర్త్ అయస్కాంతాలపై చైనా గుత్యాధిపత్యం, చైనా ఆంక్షలను అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాల్లో కీలకమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాలు తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది.

భారతదేశం ఏడాదికి 6000 మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 7280 కోట్ల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. అరుదైన ఎర్త్ ఆక్సైడ్‌లను లోహాలుగా మార్చడం, లోహాలను మిశ్రమ లోహాలుగా మార్చడం, వీటిని అయస్కాంతాలుగా ఉత్పత్తి చేయడం వంటి ప్రక్రియలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఈ పథకాన్ని ఏడేళ్ల కాలానికి ఆమోదించారు. ప్రస్తుతం, భారత్ దాదాపుగా శాశ్వత అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటోంది.

2030 నాటికి వీటి డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో చైనాపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మొత్తం బడ్జెట్‌లో, ఐదు సంవత్సరాలలో అమ్మకాల-సంబంధిత ప్రోత్సాహకాలుగా 6,450 కోట్లు ఇవ్వబడతాయి. ఫెసిలిటీల ఏర్పాటుకు 750 కోట్ల మూలధన సబ్సిడీగా అందించనున్నారు.

ఈవీ వాహనాల్లో వాడే మోటార్స్, విండ్ టర్బైన్స్, డ్రోన్లు, శాటిలైట్లు, వైద్య పరికరాల్లో ఈ అయస్కాంతాలు చాలా కీలకం. ఇవి భూమిలో లభించే అరుదైన లోహ మూలకాలు. ఇవి మొత్తం 17 మూలకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. రసాయన శాస్త్రంలోని పీరియాడిక్ టేబుల్ ప్రకారం వీటిని లాంథనైట్స్ అని పిలుస్తారు ఇవి మొత్తం 15 ఉంటాయి. వీటితో పాటు మరో రెండు మూలకాలు కూడా ఇదే సమూహంలో ఉంటాయి వీటిని స్కాండియం, ఇట్రీయం అని పిలుస్తారు. ఇవి భూమి పొరల్లో చాలా అరుదుగా లభిస్తుంటాయి. వీటిని వెలికి తీసి శుద్ధి చేసి ఉపయోగించడం అనేది చాలా కష్టతరమైన పని.

సాధారణంగా బొగ్గు, ఇనుము, క్రూడ్ ఆయిల్ వంటివి ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున లభిస్తాయి. కానీ రేర్ ఎర్త్ మినరల్స్ మాత్రం చాలా తక్కువ మొత్తంలో లభిస్తాయి. వీటిని వెలికి తీసి శుద్ధి చేసి ఉపయోగించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. వీటిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఒక స్ట్రాంగ్ అయస్కాంత తత్వం ఉంటుంది, అలాగే ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలవు, అలాగే విద్యుత్ సమర్థవంతంగా ప్రసరించడానికి ఉపయోగపడతాయి.

అయితే చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడం భారత్‌కు అంత సులభం కాదు. నిధుల కొరత, సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, రేడియోధార్మిక వ్యర్థాల కారణంగా తవ్వకాలలో పర్యావరణ సమస్యలు వంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇదే సమయంలో, మ్యాగ్నెట్ రహిత ప్రత్యామ్నాయాలపై కూడా భారత్ దృష్టి సారిస్తోంది. రేర్ ఎర్త్ ఖనిజాలపై ఆధారపడటాన్ని తగ్గించే సింక్రోనస్ రిలక్టెన్స్ మోటార్ల సాంకేతికతపై పరిశోధనలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. దేశీయంగా తవ్వకాలు లాభసాటిగా లేకపోవడంతో, విదేశాల్లో మైనింగ్ భాగస్వామ్యాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే అమెరికా, యూరప్‌ దేశాలకు ఇచ్చినట్టుగానే, భారత్‌కు కూడా చైనా ఎగుమతి నియంత్రణలను సడలిస్తే పరిస్థితి మారవచ్చు. అలా జరిగితే, చౌకైన చైనా మ్యాగ్నెట్స్ భారత మార్కెట్‌ను ముంచెత్తి, దేశీయంగా పెట్టుబడులను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే కేంద్రం ఆకాంక్షలను క్యాబినెట్ నిర్ణయం నెరవేర్చనుంది. దీంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం, ప్రపంచ అరుదైన భూమి అయస్కాంత మార్కెట్‌లో భారత్‌ను కీలక ఆటగాడిగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది.

మొత్తంగా అరుదైన ఖనిజాలను దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని పెద్ద ఎత్తున మోడీ సర్కారు ప్రోత్సహిస్తోంది. దీని లక్ష్యం సింపుల్‌. దేశీయంగానే అరుదైన ఖనిజాలను ఉత్పత్తి చేసుకోవడం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం వాటి నిల్వలను సురక్షితం చేయడం. అందుకే ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రధాని మోడీ కీలక వార్నింగ్ జారీ చేశారు. కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా మార్చుకోకూడదని ప్రధాని మోడీ అప్పట్లో చెప్పారు. సప్లయ్ చైన్‌ను స్థిరంగా, వైవిధ్యం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ ఇప్పుడు అయస్కాంతాలపై భారీగా వెచ్చిస్తున్నారు.

అయస్కాంతాలపై చైనా వెనక్కి తగ్గితే మళ్లీ సుంకాలు తప్పవని బెస్సెంట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో, అయస్కాంతాల విషయంలో ప్రస్తుతం చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌ ఉద్రికత్తలు నెలకొన్నాయి. కానీ, భారత్ మాత్రం సింపుల్‌గా సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతోంది. భవిష్యత్తులో చైనా అయస్కాంతాల ఎగుమతులను ఆపేసినా పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైంది. చైనాను ఎదుర్కొనడం అంత సులువు కాదు. కానీ, ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు అంటారుగా అలాగే ప్రయత్నమైతే చేయాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button